ఈ మధ్యకాలంలో తమ మధ్య విబేధాల గురించి వారు బాహాటంగానే మాట్లాడారు. తన పాటలను విదేశీ వేదికల మీద పాడుతూ తనకు రాయాల్టీ చెల్లించకుండా వాళ్లు క్యాష్ చేసుకుంటున్నారంటూ ఇళయరాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఇళయరాజా పాటల వల్ల తనకు పేరు రాలేదని, అందరిలాగానే తను కూడా ఇళయరాజాతో పని చేసినట్టుగా బాలూ కూడా కాస్త నిష్టూరం ఆడారు! అలా అన్నేళ్ల వాళ్ల స్నేహం, వాళ్ల అద్భుత సంగమాన్ని తక్కువ చేసుకునేలా వాళ్లే మాట్లాడారు. అయితే అదంతా పైకి మాట్లాడే మాటలే కానీ, వాళ్ల స్నేహంలో గాఢత తగ్గలేదని ఒక కష్టకాలంలో రుజువవుతూ ఉంది.
కరోనా బాధితుడిగా చికిత్స పొందుతున్న ఎస్పీ బాలూ కోసం ఇళయరాజా స్పందించారు. తమ మధ్య విబేధాలు ఏవైనా ఉంటే అవి దూదిపింజల్లాంటివే అని ఇళయరాజా స్పందించారు. బాలూ తో తన బంధం స్వరం, సంగీతం లాంటిదని.. ఈ రెండూ ఒకటి లేకుండా మరోటి ఉండవని ఇళయారాజా తమ బంధం గురించి వివరించారు. బాలూతో తన బంధం సినిమాలతో మొదలు కాలేదని, అది సినిమాలతో ముగియదని ఇళయరాజా భావోద్వేగంగా చెప్పారు. తమ జీవితం, జీవితాధారం అయిన సంగీతంతో తన-బాలూ బంధం మిళితమైనదని గుర్తు చేశారు.
ఇలా ఆప్తమిత్రుడు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న వేళ ఇళయరాజా..అతడిని త్వరగా కోలుకుని రమ్మంటూ పిలిచాడు. 'ఏ..రా' అంటూ ఆప్యాయంగా పిలుచుకోగల ఈ స్నేహితుడి పిలుపును అందుకుని బాలూ త్వరగా కోలుకోవాలని.. ఈ సంగీత శిఖరాల అశేష అభిమానగణం ఆకాంక్షిస్తోంది. గెట్ వెల్ సూన్ ఎస్పీబీ సార్!