లెక్క ప్రకారం ఇండియాలో కరోనా సెకెండ్ వేవ్ క్షీణిస్తూ ఉంది. మార్చి నెల నుంచి పెరుగుతూ వచ్చిన కేసులు మే నెల నుంచి క్షీణిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో రోజుకు 80 వేల స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని చూస్తే ఈ నెలాఖరుకు ఇండియాలో సెకెండ్ వేవ్ పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి.
ప్రజలు ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతున్నారు. ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ నియమాలను కాస్త సడలిస్తూ ఉన్నాయి. కానీ, గమనించాల్సిన అంశం ఏమిటంటే.. రోజుకు 80 వేల కేసులు నమోదవుతుండటంతో, ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా నిలుస్తోంది ఇండియా.
మరే దేశంలోనూ ఈ స్థాయిలో ఇప్పుడు కరోనా కేసులు నమోదు కావడం లేదు. 80 వేల స్థాయిలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా నిలుస్తోంది ఇండియా. నాలుగు లక్షలకు పైగా కేసులను అధికారికంగానే చూసిన దేశానికి 80 వేల కేసులు పెద్దవేవీ అనిపించడం లేదు కానీ, మిగతా ప్రపంచ దేశాలన్నింటి కన్నా మాత్రం ఎక్కువ కేసులు ఇండియాలోనే నమోదవుతున్నాయి.
ఇక కరోనా కారణ మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదవుతూ వస్తోంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకెండ్ వేవ్ లో ఈ శాతం కూడా పెరిగింది. రాష్ట్రాలు దాచి పెట్టిన లెక్కలు కూడా ఇప్పుడిప్పుడు మరింతగా బయటకు వస్తున్నాయి. బిహార్ మొన్న భారీ సంఖ్యను అనౌన్స్ చేయగా, నేటి గణాంకాల్లో మహారాష్ట్ర ప్రకటించిన నంబర్ రెండు వేలకు పైనే!
ఇక వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతూ ఉంది. ఇప్పటి వరకూ కనీసం ఐదారు శాతం జనాభాకు కూడా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి కాలేదుని గణాంకాలు చెబుతున్నాయి.