175 ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తే 23 సీట్లు వచ్చాయి. 25 ఎంపీ సీట్లకు పోటీ చేస్తే 3 దక్కాయి. అప్పటికే తెలంగాణలో పార్టీ జీరో అయిపోయింది. సాధారణంగా ఏ జాతీయ పార్టీలోనో అయితే.. అలాంటి ఓటమికి బాధ్యతగా నాయకుడు తప్పుకుంటారు! రాజీనామా చేస్తారు. మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారు. సదరు నాయకుడిని ప్రజలు తిరస్కరించినట్టుగా స్పష్టం అవుతుందలా. అయితే చంద్రబాబు నాయుడును తిరస్కరించినది కేవలం ప్రజలు మాత్రమే కాదు, తెలుగుదేశం ఆవిర్భావం దశ దగ్గర నుంచి ఆ పార్టీలో పుట్టి పెరిగిన నేతలు కూడా ఇప్పుడు చంద్రబాబును తిరస్కరిస్తూ ఉన్నారు. మరి ఇది చంద్రబాబు నాయుడి నాయకత్వ వైఫల్యం కాదా?
ప్రాంతీయ పార్టీలకు ఓటములు మామూలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆవిర్భావంతోనో ఓడిపోయింది. అయితే జగన్ పార్టీ 23 సీట్లకు పరిమితం కాలేదు. అనేక ఆరోపణలు, అటు కాంగ్రెస్ తో పోరాటం, ఇటు తెలుగుదేశంతో పోరాటం, జగన్ ను 16 నెలల పాటు జైల్లో పెట్టారు. అవినీతి ఆరోపణలు చేశారు, లక్ష కోట్లు అన్నారు, అంతకు పదేళ్ల నుంచి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండింది. తెలుగుదేశం, బీజేపీ, పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేశారు..అంత చేసినా జగన్ అధికారానికి దూరం అయ్యింది కేవలం ఐదున్నర లక్షల ఓట్లతో మాత్రమే! ప్రతిపక్షంలోకి పడినా 67 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. 8 ఎంపీ సీట్లు దక్కాయి. ఓట్ల శాతం విషయంలో జగన్ పార్టీ.. టీడీపీ, బీజేపీ, జనసేనల కన్నా కేవలం ఒక్కటిన్నర శాతం మాత్రమే వెనుక నిలిచింది.
ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికే చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సింది. అయితే చంద్రబాబు నాయుడు అలాంటి బాధ్యతలు ఏవీ తీసుకోలేదు. ఇప్పుడు పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్లిపోతూ ఉన్నారు. వారేమీ పదవుల్లో కూడా లేరు అధికార పక్షం పిలుస్తోంది అనేందుకు! తెలుగుదేశం పై నమ్మకం పోయింది ఆ నేతలకు. తెలుగుదేశం ఇక అధికారంలోకి రాదు.. అనే ఒక అభిప్రాయం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు తీరు సరిగా లేకపోవడం అందుకు ఒక కారణం అయితే, టీడీపీ భవిష్యత్ నాయకుడిగా కనిపిస్తున్న లోకేష్ పై ఏ మాత్రం గురి కుదరకపోవడం అందుకు రెండో కారణం.
పదవిలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతుండగానే జగన్ తను చెప్పిన హామీలను చాలా వరకూ అమలు చేశారు. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకుని, తెలుగుదేశం పార్టీని నేతలను వీడుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం వాస్తవాలను ఒప్పుకోకుండా, ఇంకా క్యాడర్ కు ఏవో భ్రమలు కల్పించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.