మొన్నటివరకు ఉద్యోగులపై సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు. సమ్మె చేసినా అరెస్టులు చేయొద్దని పోలీసులకు చెప్పారు. ఈ గ్యాప్ లో ప్రభుత్వం తరఫున ఓ కమిటీ వేసి, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. కానీ ఉద్యోగులు మాత్రం మొండి పట్టుదలకు పోతున్నారు. ప్రభుత్వ వాదనను అస్సలు పట్టించుకోవడం లేదు. మరోవైపు వేతనాల ప్రాసెస్ కు కూడా కొంతమంది నిరాకరించడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ వాదన ఇది
కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ ఉద్యోగుల కోసం చేయాల్సిందంతా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత మరింత లబ్ది చేకూరుస్తానని కూడా మాటిచ్చారు. ప్రస్తుతానికి ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకొని, సమ్మె నోటీసులు విరమించుకొని విధుల్లోకి రావాలని కోరుతున్నారు. ఉద్యోగుల సమస్యల్ని సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తామని, కాకపోతే ఇది సమయం కాదని చెబుతున్నారు
ఉద్యోగల మొండి వైఖరి ఇది
అటు ఉద్యోగులు మాత్రం ఇప్పుడుకాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తక్షణం తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. ప్రభుత్వం మాట వినకుండా మొండి వైఖరి అవలంబిస్తున్నారు. ఇప్పటికే సహాయ నిరాకరణ మొదలుపెట్టారు. 6వ తేదీ అర్థరాత్రి నుంచి పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు.
ఉద్యోగుల డిమాండ్లను చాలా వరకు తీర్చామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఉద్యోగులు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించడం లేదు. తమ న్యాయమైన డిమాండ్లను తీర్చకుండా, పైపెచ్చు జీతాల్లో కోత విధించిందని చెబుతున్నారు. కొత్త పీఆర్సీ జీవోను తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాతే చర్చలకు వస్తామంటున్నారు. అటు ప్రభుత్వం మాత్రం ముందు చర్చలకు రావాలని కోరుతోంది. దీంతో ఈ వ్యవహారంపై పీటముడి పడింది.
ప్రభుత్వం ఏం చేయబోతోంది?
ఈ మొత్తం పరిణామాలన్నీ ముఖ్యమంత్రి జగన్ కు ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది. ఉద్యోగులపై ఇకపై సీరియస్ గా వ్యవహరించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అవసరమైతే ఎస్మా ప్రయోగానికి కూడా వెనకాడొద్దని ఆయన చూచాయగా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతకంటే ముందు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు సీఎం. ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు చూస్తోందంటే, దానర్థం ఉద్యోగులపై ఆగ్రహంతో ఉన్నట్టే.
ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఏ ఒక్క అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ ఉపేక్షించరు. అది ఉద్యోగుల సమ్మె అయినప్పటికీ ఆయన చూస్తూ ఊరుకోరు. ఇన్నాళ్లూ బుజ్జగింపులు చేశారు. ఇప్పుడు తన కోపాన్ని చూపించబోతున్నారని సమాచారం.