ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ మరోసారి అదే పట్టు పట్టింది. తన వాదనలు వినిపించే ప్రశ్నే లేదని మరోసారి చాటి చెప్పింది. దీంతో జగన్ బెయిల్‌కు సంబంధించి సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సీబీఐ వ్యవహారశైలిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జగన్ బెయిల్ రద్దు అవుతుందని ఆశించిన వాళ్లకు… తీర్పు ఎలా ఉంటుందో సీబీఐ వైఖరి చెప్పకనే చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై వైఖరి తెలియజేయాలంటూ సీఎంతో పాటు సీబీఐకి సీబీఐ కోర్టు నోటీసులు పంపింది. ఈ పిటిషన్ మొదటిసారి విచారణకు వచ్చినప్పుడు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించగా, ఎలాంటి కౌంటరు వేయబోమని, నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలి పెడుతున్నట్లు రాతపూర్వకంగా తెలిపిన సంగతి తెలిసిందే.
సీబీఐ సమర్పించిన ఈ అఫిడవిట్ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. బీజేపీతో జగన్‌కు సన్నిహిత సంబంధాలు ఉండడం వల్లే సీబీఐ ముందుకు వెళ్లలేకుందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి కోర్టుకు సీబీఐ తమ అభిప్రాయాన్ని వెల్లడించింది.
జగన్ బెయిల్‌కు సంబంధించి ఎలాంటి వాదనలు వినిపించబోమని సీబీఐ గురువారం సీబీఐ కోర్టుకు మరోసారి నివేదించింది. రెండోసారి కూడా అభిప్రాయంలో సీబీఐ పట్టు సడలనివ్వకపోవడం గమనార్హం.
వాదనలు వినిపిస్తామని గత వారం చెప్పినప్పటికీ, ఎలాంటి వాదనలు వినిపించబోమని తాజాగా పేర్కొనడం ఆశ్చర్యపరుస్తోంది. ఏది ఏమైనా బెయిల్ రద్దుపై కేసు నమోదు చేసిన సీబీఐకే లేనప్పుడు, ఇతరుల ఆసక్తి ఏమిటన్నదే ఇప్పుడు ప్రశ్న.