చంద్రబాబు మాంచి దూకుడు మీదున్నారు. విమర్శలతో పనికావట్లేదని గ్రహించి, సింపతీ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. అనుమతి లేకపోయినా విశాఖలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టి పోలీసులు అడ్డుకున్నారని నానా యాగీ చేశారు. అనుకూల మీడియాతో దీన్ని హైలెట్ చేయించుకుని వార్తలు రాయించుకుంటూ.. రాష్ట్రంలో రౌడీ పాలన అంటూ రెచ్చిపోతున్నారు. దీనికి పరాకాష్టగా ఈనెల 15న నెల్లూరుజిల్లా టూర్ కి సిద్ధమైపోయారు బాబు.
15వతేదీ వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని నెల్లూరు నుంచి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి జగన్. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. నెల్లూరు నగర పరిధిలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. చంద్రబాబు కూడా ప్రీ ప్లాన్డ్ గా 14, 15వ తేదీల్లో నెల్లూరు టూర్ ప్లాన్ చేసుకున్నారు. రెండు రోజులూ నెల్లూరులోనే ఉంటారు. శాంతి భద్రతల దృష్ట్యా బాబు పర్యటన వాయిదా వేసుకోమని పోలీస్ వర్గాలు సూచించినా ఆయన వినట్లేదు. వచ్చేది వచ్చేదే అంటూ రెచ్చిపోతున్నారు, స్థానిక నాయకులను జన సమీకరణకు పురమాయించారు.
ఇటు అధికారిక కార్యక్రమం, అటు అనధికారికంగా చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం. వాస్తవానికి జిల్లాల పర్యటనలో భాగంగా ఈనెల 4, 5 తేదీల్లో చంద్రబాబు నెల్లూరుకు రావాల్సి ఉంది. అయితే జగన్ పర్యటన కారణంగానే.. బాబు కూడా ఈనెల 14, 15న తన ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా కార్యక్రమాన్ని నీరుగార్చేందుకే చంద్రబాబు ఇలా తన షెడ్యూల్ మార్చుకున్నారు.
ప్రభుత్వం కార్యక్రమం కాబట్టి దానికి విఘాతం కల్గించడం లాంటి దుస్సాహసానికి బాబు పూనుకోకపోవచ్చు. కానీ దానికి సమాంతరంగా.. రైతు భరోసా కార్యక్రమం జరుగుతున్న టైమ్ లో ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం నిర్వహించేందుకు చంద్రబాబు ఇప్పటికే తన శ్రేణుల్ని సిద్ధంచేశారు. మొత్తమ్మీద ఈనెల 15న జగన్ తో ఫేస్ టు ఫేస్ తలపడేందుకు బాబు సిద్ధమైపోయారు. అలా మైలేజీ పెంచుకోవాలనేది బాబు కుయుక్తి. నెల్లూరు వేదికగా అటు సీఎం, ఇటు ప్రతిపక్షనేత ఇద్దరూ ఒకేరోజు పర్యటనలు పెట్టుకోవడంతో పోలీసులు టెన్షన్ తో తలలు పట్టుకున్నారు.