అడకత్తెరలో ఆ 4 స్థానాలు.. జగన్-బాబు ఏం చేస్తారు?

సీఎంగా ఉన్న జగన్ కు కొన్ని రాజకీయ సమస్యలుంటాయి, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకి వేరే సమస్యలుంటాయి. కానీ ఇప్పుడు ఇద్దరికీ కామన్ గా కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. ఏపీలోని 4 నియోజకవర్గాల విషయంలో జగన్,…

సీఎంగా ఉన్న జగన్ కు కొన్ని రాజకీయ సమస్యలుంటాయి, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకి వేరే సమస్యలుంటాయి. కానీ ఇప్పుడు ఇద్దరికీ కామన్ గా కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. ఏపీలోని 4 నియోజకవర్గాల విషయంలో జగన్, చంద్రబాబు ఇద్దరూ ఒకేరకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. అవును, టీడీపీ నుంచి వైసీపీకి వచ్చి చేరిన ఎమ్మెల్యేలు.. జగన్-బాబు ఇద్దరికీ కామన్ సమస్యలు తెచ్చిపెట్టారు.

విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఈ నలుగురూ టీడీపీకి బైబై చెప్పేసి వైసీపీ వైపు వచ్చేశారు. నేరుగా కండువాలు కప్పేందుకు జగన్ పాలసీ అడ్డురావడంతో.. టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే వైసీపీ అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ 4 నియోజకవర్గాల్లో వీరికి వైసీపీ నేతలతో సమస్యలున్నాయి. కొన్నిసార్లు సీఎం జగన్ నేరుగా వాటిని సర్దుబాటు చేశారు కూడా.

ఇప్పుడేంటి సమస్య..?

టీడీపీ నుంచి వైసీపీకి వచ్చి, బేషరతుగా జగన్ కు మద్దతిచ్చారు కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఆ నలుగురికి అవే స్థానాల నుంచి వైసీపీ టికెట్లు ఇవ్వాల్సి ఉంది. అదే జరిగితే, ఆ స్థానాల్ని ఆశిస్తున్న అసలైన అభ్యర్థులు నిరాశ చెందుతారు. వాళ్లు రెబల్స్ గా మారే ప్రమాదం ఉంది. 

ఇప్పటికే అక్కడ నియోజకవర్గ ఇంచార్జిలుగా వైసీపీ నేతలున్నారు. వారిని కాదని, టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ మర్యాదలు చేసే విధంగా అనధికార ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఆ 4 నియోజకవర్గాల్లో ఇంచార్జులు అసంతృప్తితో ఉన్నారు, కాస్త సైలెంట్ అయ్యారు. అటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ శ్రేణులతో పూర్తి స్థాయిలో కలిసిపోలేకపోతున్నారు.

చంద్రబాబు పరిస్థితి ఏంటి..?

ఇటు చంద్రబాబుది మరో సమస్య. ఆ 4 స్థానాల్లో అభ్యర్థులు దొరక్క ఈయన ఇబ్బంది పడుతున్నారు. పైగా టీడీపీ ఓటు బ్యాంక్ ఆ నలుగురుతో అటే వెళ్లిపోయిందా, ఇంకా టీడీపీ వైపే ఉందా అనేది బాబు అనుమానం. పోనీ ఎన్నికలనాటికి వైసీపీ రెబల్ అభ్యర్థిని పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇస్తే టీడీపీ హార్డ్ కోర్ జనాలు ఓటేసే అవకాశాలు తక్కువ. 

అలాగని కొత్త అభ్యర్థుల్ని ప్రకటిస్తే.. స్థానికంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయలేని పరిస్థితి. అందుకే ఇప్పుడు చంద్రబాబు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి హడావిడి మొదలు పెట్టాలనుకుంటున్న చంద్రబాబు, ఆ 4 స్థానాలు మాత్రం విషమ పరీక్ష పెట్టబోతున్నాయి.

రాపాకను వదిలేసినట్టేనా..?

టీడీపీ నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు, జనసేన నుంచి వచ్చిన రాపాక వరప్రసాద్ కి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత జగన్ పైనే ఉంది. అయితే రాపాకకు ఆల్రెడీ ఇప్పటికే ఓ హింట్ వెళ్లిపోయింది. వచ్చే ఎన్నికల్లో రాపాకకు వైసీపీ నుంచి టికెట్ వచ్చే అవకాశం లేదని తేలిపోయిందట. 

ఈ మేరకు రాపాక తనయుడికి పార్టీలో ప్రాధాన్యం ఇస్తారట. దీంతో ఆయన స్వచ్ఛందంగానే సైడ్ అయిపోయినట్టు తెలుస్తోంది. రాగా పోగా టీడీపీ నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల విషయంలోనే జగన్ కాస్త గాభరా పడుతున్నారు. అటు చంద్రబాబు కూడా ఆందోళనలో ఉన్నారు.