ఏపీలో జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి కొత్తపుంతలు తొక్కుతున్నాడని వైసీపీ నాయకులు అంటూ ఉంటారు. కొత్త కాన్సెప్టులతో, కొత్త కొత్త పేర్లతో సంక్షేమ పథకాలను ఇబ్బడిముబ్బడిగా అమలు చేస్తున్నాడు. అదే విధంగా పరిపాలనలోనూ కొత్తదనం చూపిస్తున్నాడు. కొత్త ఐడియాలజీ ప్రవేశపెట్టాడు. పాత సంప్రదాయాలను బద్దలు కొడుతున్నాడు. కొత్త బాటలు పరుస్తున్నాడు.
విదేశాల నుంచి, మనదేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ఇన్స్పిరేషన్ పొందుతున్నాడు. పడనివాళ్ళు కాపీ కొడుతున్నదని అంటున్నారనుకోండి. అది వేరే విషయం. చంద్రబాబు హయాంలో రాజధానిగా అమరావతికి మద్దతు పలికిన జగన్ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ఒక్క రాజధాని ఏం బాగుంటుంది. ఒక్క రాజధానినే డెవలప్ చేస్తే హైదరాబాదు మాదిరిగా అభివృద్ధి మొత్తం ఒక్కచోటనే కేంద్రీకృతమైపోతుంది. దీంతో మిగతా ప్రాంతాల్లో నిరసనలు వచ్చే అవకాశమున్నదంటూ మూడు రాజధానులు అన్నాడు.
ఇది దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్న కాన్సెప్ట్. ఆ దేశంలో కొన్ని చారిత్రిక కారణాలవల్ల మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే చరిత్ర మనకు అనవసరం అనుకొని, మన రాజకీయాలకు ఇది పనికొస్తుంది అని భావించి మూడు రాజధానులను ప్రకటించాడు. దీని మీద జరిగిన రచ్చ ఏమిటో, కోర్టు కేసులు ఏమిటో మనకు తెలుసు. ఈ వివాదం ముదురు పాకాన పడ్డాక ఓ శుభ ముహూర్తాన మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.
పోనీలే … ఇప్పటికైనా జగన్ మారిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ మూడు రాజధానుల రద్దు తాత్కాలికమేనని, ఎలాంటి వివాదాలు తలెత్తని విధంగా బిల్లులు మళ్ళీ తయారు చేసి అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. మూడు రాజధానుల మీద కొత్త కాన్సెప్టుతో ముందుకు వస్తున్నాడట. మూడులో మార్పు ఏమీ లేదు. కానీ ఒక్కటే రాజధాని ఉంటుంది. అది అమరావతే. మరి విశాఖపట్నం, కర్నూలు ఏమిటి? అవి ఉప రాజధానులట.
రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి, కేంద్రంలో ఉప ప్రధాని పదవులు ఉన్నట్లుగా ఉప రాజధానులను పెట్టబోతున్నారట. ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధాని పదవులు అనేవి రాజ్యంగంలో లేవు. రాజకీయంగా గొడవలు రాకుండా ఉండటం కోసం ఆ పదవులు సృష్టించుకున్నారు. సాధారణంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఒక్కటే ఉంటుంది. ఉప ప్రధాని పదవి కూడా ఒక్కటే ఉంటుంది. ఇవి తప్పనిసరిగా ఉండాలని రూలేమీ లేదు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను పెట్టాడు.
వివిధ వర్గాలను సంతృప్తి పరచడానికి ఈ ఏర్పాటు. వారికి ఏమీ కొమ్ములుండవు. వారు కూడా అందరిలాంటి మంత్రులే. ఇదిలా ఉంచితే …రాష్ట్రంలో మూడు రాజధానుల బదులు ఒక రాజధాని..రెండు ఉప రాజధానుల కాన్సెప్ట్ ను తెర మీదకు తెచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఇదే కాన్సెప్ట్ ను జార్ఖండ్ నుంచి తీసుకున్నారట. న్యాయ పరమైన వివాదం లేకుండా… అమరావతిని రాష్ట్ర రాజధానిగా పేర్కొంటూనే విశాఖపట్నం, కర్నూలును ఉపరాజధానులుగా ప్రకటిస్తారట.
ఈ మేరకు రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి గతంలో వలే కోర్టులో సమస్యలు రాకుండా.. ఏ ప్రాంతం నుంచి అభ్యంతరాలు రాకుండా న్యాయ పరంగానూ..ఇటు రాజకీయంగానూ ఆచి తూచి బిల్లును సిద్దం చేస్తున్నట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం రీత్యా ఉప రాజధానుల్లో అనుబంధ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే విధంగా బిల్లులో పొందుపరుస్తారు.
మంత్రులు బొత్సా..కొడాలి నాని వంటి వారు సైతం ప్రతిపక్షాలు అడ్డుపడినా మూడు రాజధానుల నిర్ణయం ఆగదని..ప్రజామోదంతో మూడు రాజధానులు ఏర్పాటవుతాయని స్పష్టం చేసారు. మరి ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.