ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటు చేసుకుంటున్న ఉన్నతాధికారుల బదిలీలు రాజకీయ రంగు పులుముకున్నాయి. దీన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యూహాత్మకంగా ఉపయోగించుకునేందుకు పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పచ్చి అవకాశ వాదిగా, స్వార్థపరుడిగా చిత్రీకరించేందుకు ఉన్నతాధికారుల బదిలీలే నిదర్శనమనే రీతిలో విమర్శలకు పదును పెట్టింది.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఉద్యోగులను వాడుకుని వదిలేయడంలో జగన్‌కు మించిన వారు మరొకరు లేరని ఆరోపించారు. అవసరం తీరే వరకూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నా… అన్నా అంటూ వెంటపడుతారని వెటకరించారు. ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను వాడుకున్నారని ఆరోపించారు.
అవసరం తీరాక ఇప్పుడు గౌతమ్ సవాంగ్‌ను అవమానకర రీతిలో సాగనంపారని తూర్పార పట్టారు. డీజీపీ స్థాయి వ్యక్తికి కనీసం పోస్టింగ్ ఇవ్వకపోవడం ముమ్మాటికీ అవమానించడమే అని ఆయన అన్నారు. ఐఏఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేశ్, అజయ్ కల్లంలతోనూ ఇదే విధంగా జగన్ వ్యవహరించారని ఆరోపించారు.
ఇప్పటికైనా జగన్ వ్యవహార శైలిని, నైజాన్ని ఉద్యోగులు, పోలీసులు అర్థం చేసుకోవాలని ఆయన అభ్యర్థించారు. ఇదిలా వుండగా అజయ్ కల్లం ఇంకా ఏపీ ప్రభుత్వంలో సలహాదారుడిగా కొనసాగుతున్నారు. తనను జగన్ అవమానించినట్టు ఇంత వరకూ ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కనీసం ఇప్పుడు యనమల ఆరోపణలను ఆయన ఖండిస్తారో లేదో మరి!