టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను నీచమైన నాయకుడిగా కేటీఆర్ అభివర్ణించడం గమనార్హం. రేవంత్‌పై కేటీఆర్ తాజా ట్వీట్‌ను పరిశీలిస్తే… టీపీసీసీ అధ్యక్షుడిపై టీఆర్ఎస్ ఎలాంటి అభిప్రాయంతో ఉందో అర్థం చేసుకోవచ్చు.
పార్టీలకు అతీతంగా రాహుల్‌గాంధీపై బీజేపీకి చెందిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండించి, నైతికంగా అండగా నిలిచిన తమ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలడాన్ని దీటుగా తిప్పి కొట్టారు.
“మీ తండ్రి ఎవరో మేము అడగడం లేదు కదా” అని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి అసోం ముఖ్యమంత్రి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రిపై ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన, ఒక చరిత్ర కలిగిన నెహ్రూ కుటుంబ సభ్యుడైన రాహుల్‌గాంధీపై అసోం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేసీఆర్ అన్నారు.
ఇదేనా బీజేపీ సంస్కృతి అని ఆయన ప్రశ్నించారు. వెంటనే అసోం సీఎంను బీజేపీ అధిష్టానం బర్తరప్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ నాయకుడికి నైతికంగా మద్దతు ఇచ్చిన కేసీఆర్‌కు కనీసం కృతజ్ఞతలు చెప్పకపోగా, ఊసరవెల్లితో రేవంత్ పోల్చారు. అలాగే కేసీఆర్ నమ్మదగ్గ నాయకుడు కాదని, అతనితో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ప్రసక్తే లేదని రేవంత్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్‌పై కేటీఆర్ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. కేటీఆర్ ట్వీట్ ఏంటంటే…
“కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అసోం సీఎం అనైతికంగా మాట్లాడితే మా నాయకుడు కేసీఆర్ ఖండించారు. రాజనీతిజ్ఞుడిగా రాజీవ్ గాంధీ గౌరవాన్ని సీఎం కేసీఆర్ కాపాడారు. మీ పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నారు. రాహుల్ జీ మీరు అత్యంత నీచమైన నాయకుడిని పీసీసీ చీఫ్‌గా ఎన్నుకున్నారు. అతను త్వరగానే కోలుకుంటాడని ఆశిస్తున్నా” అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై రేవంత్, రాహుల్‌గాంధీ స్పందనపై ఉత్కంఠ నెలకుంది.