వివాదాల జోలికి వెళ్లడం లేదు

తిరుమ‌ల అంజ‌నాద్రిపై ఎలాంటి దేవాల‌యాల నిర్మాణం చేప‌ట్ట వ‌ద్ద‌ని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేప‌థ్యంలో తాము వివాదాల జోలికి వెళ్లాల‌ని అనుకోవ‌డం లేద‌ని టీటీడీ పాల‌క మండలి చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అంజనాద్రిపై…

తిరుమ‌ల అంజ‌నాద్రిపై ఎలాంటి దేవాల‌యాల నిర్మాణం చేప‌ట్ట వ‌ద్ద‌ని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేప‌థ్యంలో తాము వివాదాల జోలికి వెళ్లాల‌ని అనుకోవ‌డం లేద‌ని టీటీడీ పాల‌క మండలి చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అంజనాద్రిపై హ‌నుమంతుడు జ‌న్మించార‌ని ఇటీవ‌ల టీటీడీ ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది. 

ఈ నేప‌థ్యంలో అక్క‌డ దేవాల‌యం నిర్మాణాన్ని చేప‌ట్టేందుకు బుధ‌వారం భూమి పూజ చేస్తున్నార‌ని, తిరుమల శ్రీవారి వైభవాన్ని తగ్గించేలా టీటీడీ చేప‌డుతున్న నిర్మాణాన్ని అడ్డుకోవాల‌ని కోరుతూ క‌ర్నూలు జిల్లాకు చెందిన రాఘవేంద్రతో పాటు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యంపై  విచారించిన హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

అంజనాద్రిపై సుందరీకరణ పనులు మినహా దేవాలయం, ఆల‌యంతో పాటు ఇత‌ర నిర్మాణాలు చేప‌ట్టొద్ద‌ని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. సుందరీకరణ పనులకు భూమిపూజ చేపట్టవచ్చని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఆకాశగంగ సమీపంలోని హనుమాన్‌ జన్మస్థలంలో అభివృద్ధి పనులకు బుధవారం టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి త‌దిత‌ర ప్ర‌ముఖులు భూమిపూజ చేశారు.

ఈ సంద‌ర్భంగా హైకోర్టు ఆదేశాల‌ను దృష్టిలో పెట్టుకుని వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ అంజనాద్రిలో అభివృద్ధి పనులకి భూమి పూజ చెయ్యడం గొప్ప కార్యక్రమంగా అభివ‌ర్ణించారు. ఆకాశగంగ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంద‌న్నారు. హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడని టీటీడీ నమ్ముతోందన్నారు. అందుకే ఆకాశగంగ ప్రాంతాన్ని సుందరీకరించాలని నిర్ణయించామని ఆయ‌న‌ చెప్పారు. కోర్టులో దీనిపై స్టే వచ్చిందని కొంద‌రు త‌న దృష్టికి తెచ్చార‌న్నారు.

ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మాత్ర‌మే చేపట్టామ‌న్నారు. అంతే త‌ప్ప ఆలయంలో ఎలాంటి మార్పులు చెయ్యడం లేదన్నారు. వివాదాల జోలికి తాము వెళ్లడం లేదన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తున్నామ‌న్నారు. స్వామి ఆశీస్సులు, ఆజ్ఞతోనే ఇవ‌న్నీ చేస్తున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు.