మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ సహ నిందితులైన ఉమాశంకర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డి వేసిన పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టేసింది. దీంతో వారికి చుక్కెదురైంది. మాజీ మంత్రి వివేకా హత్య కేసును హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా హత్య కేసులో ఏ4 నిందితుడైన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారాడు.
దస్తగిరి అప్రూవర్‌గా మారడంపై సహనిందితులు ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి మొదటి రోజు నుంచి అభ్యంతరం చెబుతున్నారు. ఇదంతా తమను కేసులో నుంచి బయటకు రాకుండా సీబీఐ ఆడిస్తున్న డ్రామాగా వారు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అప్రూవర్‌గా మారిన దస్తగిరి సుమారు 164 పేజీల వాంగ్మూలం ఇచ్చాడు. ఇందులో పలు సంచలన విషయాలు ఉన్నాయి.
కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం దస్తగిరి వాంగ్మూలమే. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని కిందికోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో సహ నిందితులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
ఇప్పటికే నిందితుల పిటిషన్లపై హైకోర్టు విచారించింది. ఇవాళ మరోసారి విచారించి కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుల పిటిషన్లను కొట్టేస్తున్నట్టు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. న్యాయస్థానంలో ప్రతికూల తీర్పు రావడంతో హత్య కేసులో దస్తగిరి సహ నిందితులకు నిరుత్సాహం తప్పలేదు.