హాస్యం సినిమాలకే పరిమితం కాదు. రాజకీయాల్లో కూడా హాస్యం పండించే వాళ్లు లేకపోలేదు. జాతీయ పార్టీ బీజేపీకి అద్భుత హాస్య నటుడు దొరికాడు… ఈ మాట ఆ పార్టీ ప్రత్యర్థి నాయకుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ అంటుండం విశేషం. బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రూపంలో అద్భుత హాస్య నటుడు దొరికాడని మంత్రి కేటీఆర్ తనదైన వ్యంగ్య ధోరణిలో చెప్పుకొచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఓటు వేయకపోతే సీఎం యోగి మీ ఇళ్లను కూల్చేస్తాడని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వేలాదిగా జేసీలు, బుల్డోజర్లను యోగి తెప్పించినట్టు రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసి, బీజేపీని ఇరకాటంలోకి నెట్టారు. రాజాసింగ్ ఓటర్లను బెదిరించే వ్యాఖ్యలపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
‘బీజేపీకి అద్భుతమైన హాస్యనటుడు దొరికాడు. ఇక వీరు ఇంతకు మించి దిగజారరులే అనుకున్న సమయంలోనే ఈ హాస్యనటుడు దొరికాడు’ అంటూ కేటీఆర్ ట్విటర్ వేదికగా సెటైర్ వేశారు. ప్రత్యర్థులకు రాజాసింగ్ అప్పుడప్పుడు ఆయుధాలు అందిస్తుంటారు.
రాజాసింగ్‌ను అద్భుత హాస్య నటుడని కేటీఆర్ అభివర్ణించడం వెనుక వ్యంగ్యం, నిరసన ఉన్నాయి. తానో ప్రజా ప్రతినిధి అనే విషయాన్ని మరిచి, అప్రజాస్వామిక, నియంతృత్వ ధోరణితో ఆయన ప్రత్యర్థులతో పాటు ప్రజలపై అవాకులు చెవాకులు పేలుతుంటారు. రాజాసింగ్ వ్యాఖ్యలు బీజేపీకి తలనొప్పిగా మారాయి.