ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన వరుసగా రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, పోలవరం నిధులపై ఇప్పటికే అమిత్ షాతో చర్చించిన జగన్.. కరోనా నివారణ చర్యలపై కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈరోజు మరోసారి అమిత్ షాతో భేటీ అవ్వడంతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు ముఖ్యమంత్రి.
నిన్న గంట పాటు అమిత్ షా, జగన్ మధ్య భేటీ జరిగింది. విభజన చట్టంలోని హామీల అమలుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. అమిత్ షాతో భేటీలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. రాజధాని అంశంపై ఈమధ్య హైకోర్టుకు కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ పై కూడా జగన్-అమిత్ షా మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
రాత్రి ఢిల్లీలోనే బసచేసిన జగన్, మరికొద్దిసేపట్లో మరో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. పోలవరం ప్రాజెక్టుకు వెచ్చించిన 4 వేల కోట్ల రూపాయల మేర మొత్తాన్ని రీయింబర్స్ చేయాలని, పునరావాస సాయం త్వరితగతిన అందించాలని షెకావత్ ను జగన్ కోరబోతున్నారు.
షెకావత్ తో భేటీ ముగిసిన వెంటనే ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ తో భేటీ ఉంటుంది. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలతో పాటు, పోలవరం నిధులపై నిర్మలాసీతారామన్ తో చర్చిస్తారు. ఆ తర్వాత మరోసారి అమిత్ షాను కలుస్తారు జగన్. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు.
కేంద్ర మంత్రుల్ని కలిసిన తర్వాత నేరుగా ఢిల్లీ నుంచి తిరుమలకు వెళ్తారు జగన్. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి గరుడవాహన సేవలో పాల్గొంటారు. రాత్రి పద్మావతి అతిథి గృహంలో బసచేసి, రేపు మరోసారి శ్రీవారిని దర్శించుకొని అమరావతి వెళ్తారు.