ఏపీలో జగన్ నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో ఎపుడూ సంచలన నిర్ణయాలే తీసుకుంటారు. గత పాలకులు చిన్న విషయం అయినా ఏళ్ళ తరబడి ఆలోచించేవారు. కానీ జగన్ జమానాలో ఎంత పెద్ద డెసిషన్ అయినా చాలా వేగంగా తీసుకుంటారు.
అదే టైమ్ లో ఒకసారి తీసుకున్న నిర్ణయానికి ఎంత కష్టమైనా నష్టమైనా ఆయన కట్టుబడి ఉంటారు. అలాంటి ఒక కీలక నిర్ణయంతో కొత్త తెలుగు సంవత్సరాదికి జగన్ ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తారు అన్న ప్రచారం అయితే సాగుతోంది.
ఇప్పటికే కొత్త జిల్లాలతో ఏపీ పాలనను మరో మలుపు తిప్పిన జగన్ ఉగాది నుంచే కొత్త జిల్లాల అమలు అని కూడా ప్రకటించారు, ఇపుడు వాటి పక్కన మూడు రాజధానులు కూడా చేరబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లుని ప్రవేశపెట్టి చట్టంగా చేసుకోవాలన్న తపనతో వైసీపీ పాలకులు ఉన్నారు.
అన్నీ సజావుగా జరిగితే ఉగాది నాటికి జగన్ విశాఖ రాజధానికి షిఫ్ట్ అవుతారు అంటున్నారు. అంటే ఏప్రిల్ 2వ తేదీ నుంచి ముఖ్యమంత్రి విశాఖ నుంచే పాలన చేస్తారన్న పాట. ఆనాటికి సరికొత్త పాలనా రాజధానిగా విశాఖ ఉంటుంది అంటున్నారు. మొత్తానికి ఈసారి ముహూర్తం ఎట్టి పరిస్థితుల్లో గురి తప్పదని, అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని అంటున్నారు. అదే నిజమైతే విశాఖ వాసులకు ఈ ఉగాది వెరీ వెరీ స్పెషల్ గురూ అనుకోవాల్సిందే.