ఏపీలో కొత్త పథకం.. లోకేషన్న పెండ్లి కానుక!

ఏపీలో కొత్త పథకం పెట్టారు, అది కూడా ప్రతిపక్ష పార్టీ ఆధ్వర్యంలో, అది కూడా కేవలం మంగళగిరి నియోజకవర్గంలోనే. అవును.. మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా నారా లోకేష్ పేరుతో కానుకలు…

ఏపీలో కొత్త పథకం పెట్టారు, అది కూడా ప్రతిపక్ష పార్టీ ఆధ్వర్యంలో, అది కూడా కేవలం మంగళగిరి నియోజకవర్గంలోనే. అవును.. మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా నారా లోకేష్ పేరుతో కానుకలు వెళ్లిపోతున్నాయి. ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ఇదో ట్రిక్ అన్నమాట. లోకేష్ ఫొటోతో కవర్, అందులో గిఫ్ట్ బాక్స్.. అన్నిటికీ పసుపు రంగు. ఇదీ ఇప్పుడు మంగళగిరిలో అమలవుతున్న సరికొత్త పథకం.

మరోసారి మంగళగిరిలోనే తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్న నారా లోకేష్.. ఇటీవల ఆప్రాంతంలో కలియదిరుగుతున్నారు. సమయం, సందర్భం లేకపోయినా పర్యటనలు పెట్టుకుంటున్నారు. వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు ఇవ్వడం దగ్గర్నుంచి, చేనేత కార్మికులకు పలు రకాలుగా సాయం చేస్తూ హడావిడి చేస్తున్నాడు.

కరోనా వచ్చిన తర్వాత కాస్త నెమ్మదించిన చినబాబు.. మంగళగిరిలో టీడీపీ సమన్వయకర్త అనే పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి ఓ నాయకుడికి దాన్ని అప్పగించారు. లోకేష్ తరపున వ్యవహారాలన్నీ చూసుకోవడం ఆయన విధి. ఇప్పుడు ఆయన చేతుల మీదుగా లోకేష్ పెండ్లి కానుకలు పంపిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని టీడీపీ కుటుంబాలకు అని చెప్పుకుంటున్నా.. అక్కడ టీడీపీకి అంతగా మద్దతిచ్చేవారెవరూ లేరు. అక్కడంతా వైసీపీ.

వైసీపీ కుటుంబాల జోలికి వెళ్తే గొడవలైపోతాయి అనుకుంటున్నవారిని వదిలిపెట్టి, మిగతా వారందరి ఇళ్లకు వెళ్తున్నారు టీడీపీ నాయకులు. శుభకార్యాలకు లోకేష్ ఇచ్చారంటూ గిఫ్ట్ లు చేతిలో పెడుతున్నారు. పైన లోకేష్ బొమ్మతో అందమైన ప్యాకింగ్ లో వీటిని వధూవరుల చేతిలో పెడుతున్నారు. ఫొటోలు దిగి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇన్ని కుటుంబాలు టీడీపీకి మద్దతిస్తున్నాయా అనుకునేలా కలరింగ్ ఇస్తున్నారు.

సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఇప్పుడు పెండ్లి కానుక..

గతంలో చంద్రబాబు సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక.. అంటూ తన ఫొటో ముద్రించిన సంచులలో నిత్యావసరాలు ఇచ్చి గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు లోకేష్.. ఇలా పెండ్లి కానుకలు పంపించి గొప్పలు చెప్పుకుంటున్నారు. సహజంగా ఎన్నికలప్పుడు నాయకులు పిలవని పేరంటాలకు కూడా వెళ్లి చదివింపులు ఇచ్చుకుంటారు. కానీ లోకేష్.. ఎన్నికలకు రెండేళ్ల ముందే ఇలా లోకేష్ గిఫ్ట్ బాక్స్ లంటూ హడావిడి చేస్తున్నారు.