రిలీజ్ కు ముందు సినిమాపై ఎలాంటి అంచనాలు క్రియేట్ చేశాడో, రిలీజ్ తర్వాత ఆ అంచనాల్ని పూర్తిస్థాయిలో అందుకున్నాడు డీజే టిల్లూ. రిలీజ్ కు ముందు ఇచ్చిన హైప్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. మొదటిరోజు ఓ మీడియం రేంజ్ సినిమాకు వచ్చిన రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. దీంతో తొలిరోజు డీజే టిల్లు మెరిశాడు. ఏపీ,నైజాంలో కలిపి ఈ సినిమాకు ఫస్ట్ డే 3 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చింది.
ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే.. నైజాంలో రిలీజైన మొదటి రోజే డీజే టిల్లూ బ్రేక్ ఈవెన్ సాధించాడు. తొలి రోజు ఈ సినిమాకు కోటి 63 లక్షల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ వచ్చింది. దీంతో నైజాంలో ఈ సినిమా ఇవాళ్టి నుంచి లాభాల బాట పట్టినట్టయింది. ఏపీలో ఈ సినిమాకు తొలి రోజు కోటి 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది.
అటు ఓవర్సీస్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తొలి రోజే యూఎస్ లో దాదాపు బ్రేక్ ఈవన్ సాధించింది. ప్రీమియర్స్ తో కలుపుకొని ఈ సినిమాకు మొదటి రోజు యూఎస్ లో 2 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. యూఎస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో ఇవాళ్టి నుంచి ఈ సినిమాకు, కొన్ని కీలకమైన రాష్ట్రాల్లో స్క్రీన్ కౌంట్ పెంచుతున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. దర్శకుడు, హీరో కలిసి ఈ సినిమాకు కథ, మాటలు రాసుకున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది డీజే టిల్లు.