తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళను కేసులు వదిలేలా లేవు! జయమరణానంతరం తమిళనాడు రాజకీయాలను శాసించబోయిన శశికళకు ఆ తర్వాత పాత కేసులు ఊబిలా మారాయి. ఆ కేసుల్లో ఈమె జైలు శిక్షను అనుభవించి బయటకు వచ్చారు. అయితే ఇంకా ఏవేవో కేసులు, చార్జిషీట్లు ఉన్నట్టున్నాయి.
వాటి సంగతలా ఉంచితే.. ఈమె జైల్లో గడిపిన వైనం పై కూడా మళ్లీ పిటిషన్లు పడ్డాయి. అవి విచారణల వరకూ వస్తున్నట్టుగా ఉన్నాయి. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శశికళ శిక్షకాలాన్ని పూర్తి చేసుకుని కొన్నాళ్ల కిందట విడుదల అయ్యారు. అయితే ఈమె జైల్లో ఉన్నప్పుడు కారాగారం నుంచి తరచూ బయటకు వచ్చేదనే అభియోగాలు ఆల్రెడీ నమోదయ్యాయి.
కేవలం జైలు నుంచి బయటకు రావడమే కాదు, షాపింగ్ లకు కూడా తిరిగేదని, జైలు అధికారులకు లంచాలు ఇచ్చి శశికళ జైలును గెస్ట్ హౌస్ గా మార్చుకుందనే ఆరోపణలు వచ్చాయి. ఈమె బయట విహరించడానికి సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు కూడా అప్పట్లోనే సంచలనం రేపాయి.
ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం అప్పట్లో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అంతా ఆ వ్యవహారాన్ని మరిచిపోయారు కానీ, వాటిపై నమోదైన ఫిర్యాదులు విచారణ జరుగుతోందిప్పుడు. శశికళ, ఇళవరసిలు పరప్పన అగ్రహార జైలు అధికారులకు రెండు కోట్ల రూపాయల వరకూ లంచాలు ఇచ్చి బయటకు వచ్చే వారని కోర్టులో దాఖలైన పిటిషన్లపై వారికి సమన్లు జారీ అయ్యాయి. మరి జైలు శిక్షను పూర్తి చేసుకుని వచ్చినా.. ఆ జైలు శిక్షలో గడిపిన వైనం పై మళ్లీ ఆమె సమన్లను అందుకోవాల్సి రావడం గమనార్హం!