సహజంగా తమను నమ్ముకున్న వాళ్లకు సాయం చేసేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఏం చేయడానికైనా వెనుకాడరని పేరు. ఇందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఆ వారసత్వం ఆయన కుమారుడు, ఏపీ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తండ్రి అంతగా కాకపోయినా, చాలా వరకు అండగా ఉంటారనే పేరు ఉంది. జగన్ సీఎం అయ్యాక…మొదటి నుంచి తన వెంట నడిచిన వారికి పిలిచి మరీ పదవులు ఇచ్చారు. జగన్ మంత్రి వర్గమే అందుకు ఉదాహరణ.
పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, సుచరిత, వనిత, ధర్మాన కృష్ణదాస్….ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లే వినిపిస్తాయి. తాజాగా తన ప్రత్యర్థి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రుణాన్ని కూడా జగన్ తీర్చుకోవాలని భావిస్తున్నట్టున్నారు. చంద్రబాబు అప్రజాస్వామికంగా పాలన సాగించి, ప్రజల ఛీత్కారానికి గురి కాకుండా ఉంటే…జగన్ సీఎం అయ్యే అవకాశం ఉండేది కాదు.
తాను సీఎం కావడానికి ప్రధాన కారణం చంద్రబాబే అనే కృతజ్ఞత జగన్‌లో బాగా ఉన్నట్టుంది. అందువల్లే బాబు రుణాన్ని తీర్చుకునేందుకు…. టీడీపీ బలోపేతం అయ్యే చర్యలకు జగన్ శ్రీకారం చుట్టినట్టుగా ఉంది. తాను ఆశించిన ముఖ్యమంత్రి సీటు దక్కడంతో మిగిలిన విషయాలేవీ జగన్‌కు కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదని…ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే చెబుతున్నాయి.
తాజాగా రాష్ట్రంలో ఏ ఊర్లో చూసినా పింఛన్లు, రేషన్‌కార్డుల తొలగింపు మాటే వినిపిస్తోంది. దీంతో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా…అవన్నీ గాలికి కొట్టుకుపోతున్నాయి. పింఛన్లు, రేషన్‌కార్డుల తొలగింపు ప్రక్రియ జగన్ సర్కార్‌కు చెడ్డ పేరు తీసుకొస్తోంది. అందులోనూ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలతో క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతోందని వైసీపీ నాయకులు దిక్కుతోచక జుట్టు పీక్కుంటున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతిని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి…ప్రస్తుతం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రాణం పోసినట్టవుతోందని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు అసంబధ్ద నిర్ణయాలతో ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చుకుని…తనకు పాలనా పగ్గాలు అందించారనే కృతజ్ఞత జగన్‌లో ఉన్నట్టుందని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు వ్యంగ్యంగా అంటున్నారు.
ఏ మాత్రం మతిలేని పనులను…అందులోనూ స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో చేపట్టడం ఒక్క జగన్ సర్కార్‌కే చెల్లిందని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు ఎవరూ చేయరని…ఆ ఘనత తమ అధినాయకుడు జగన్‌కే దక్కుతుందని వైసీపీ నేతలు వెటకారంగా అంటున్నారు. మరి వాళ్ల గోడు చెవికెక్కించుకుంటారో లేదో చూడాలి మరి.