ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… అందరూ ఇతడ్ని మాటల ముఖ్యమంత్రి అనుకున్నారు. ఎన్నికలకు ముందు అందరూ చెప్పినట్టే జగన్ కూడా ఏదేదో మాట్లాడేశారని, గెలిచిన తర్వాత అన్నీ మరిచిపోతారని అనుకున్నారు. మరీ ముఖ్యంగా ప్రజాసంకల్పయాత్ర, ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్యావ్యవస్థపై జగన్ చేసిన కీలక ప్రకటనలు విన్న చాలామంది జనాలు నవ్వుకున్నారు. ఇవన్నీ జరిగే పనులు కావని ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్లందరికీ ఇప్పుడు జగన్ అంటే ఏంటో తెలిసొచ్చింది. జగన్ కేవలం మాటల మనిషి కాదనే విషయం బోధపడింది. అందుకు సజీవ సాక్ష్యం సభలో ప్రవేశపెట్టిన 2 కీలక బిల్లులు.
చెప్పినట్టుగానే విద్యావ్యవస్థపై సాగుతున్న గుప్తాధిపత్యాన్ని, కార్పొరేట్ అరాచకాన్ని వదిలించేందుకు సిద్ధమయ్యారు సీఎం. పాఠశాల విద్యా నియంత్రణ-పర్యవేక్షణ కమిషన్ బిల్లు, ఉన్నత విద్య నియంత్రణ-పర్యవేక్షణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు జగన్. ఎలాగూ మెజారిటీ తమదే కాబట్టి ఇవి చట్టాలుగా రూపుదాల్చడం ఇక నామమాత్రమే. ఇవి అమల్లోకి వస్తే కార్పొరేట్ విద్యాసంస్థలకు చుక్కలే. విద్యార్థుల తల్లిదండ్రులకు పండగే. ప్రస్తుతం లక్షల్లో ఉన్న ఫీజులు ఈ బిల్లుల దయతో సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి.
ఈ మేరకు రెండు బిల్లులకు అనుసంధానంగా రెండు కమిషన్లు ఏర్పాటుకానున్నాయి. వాటిలో 11 మంది సభ్యులు ఉంటారు. ప్రతి కమిషన్ కు రిటైర్డ్ జడ్డి బాధ్యత వహిస్తారు. రెండు కమిషన్లకు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చైర్మన్ గా ఉంటారు. కేవలం కమిషన్లు ఏర్పాటుచేయడమే కాదు.. సర్వహక్కుల్ని ఆ కమిషన్లకు సంప్రాప్తించేలా బిల్లులు రూపొందించి తన చిత్తశుద్ధి చాటుకున్నారు జగన్. ఇకపై ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా ఈ కమిషన్లు, విద్యావ్యవస్థ ప్రక్షాళణకు దిగుతాయి. జగన్ లక్ష్యాన్ని, ఆయన కలల్ని సాకారం చేస్తాయి.
కేవలం ఫీజుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లుల్ని తయారుచేయలేదు. ఫీజులు నియంత్రించడంతో పాటు.. విద్యార్థులపై అదనపు ఒత్తిడిని తగ్గించడం, మూల్యాంకనం, కనీస వసతుల కల్పన వంటి అంశాల్ని కూడా కమిషన్ పర్యవేక్షిస్తుంది. చివరికి ప్రైవేట్ స్కూల్స్ లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల జీతాలపై కూడా ఇది ఓ కన్నేసి ఉంచుతుంది. సింపుల్ గా చెప్పాలంటే విద్యావ్యవస్థ మొత్తాన్ని ఇది పర్యవేక్షిస్తుంది. అవసరమైతే తనకొచ్చిన కొత్త అధికారాన్ని ఉపయోగించి, ఎవర్నయినా పిలిపించి విచారించే అధికారం కూడా ఈ కమిషన్లకు ఉంది.
తాజా బిల్లులతో పాఠశాలల్లో ఫీజులు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థుల బలవన్మరణాలు తగ్గుముఖం పడతాయి. స్కూల్స్ లో మౌలిక వసతులు పెరుగుతాయి. ఉపాధ్యాయుల జీతభత్యాలు మెరుగవుతాయి. అంతెందుకు, మూతపడిన ప్రభుత్వం పాఠశాలలు కూడా తెరుచుకుంటాయి. పేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో కూడా సీటు దొరుకుతుంది. వీటికి అదనంగా అమ్మఒడి ఉండనే ఉంది. ఇలా విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి తనమాట నిలబెట్టుకున్నారు జగన్. తను మాటల ముఖ్యమంత్రిని కాదని, చేతల సీఎంనని నిరూపించుకున్నారు.