తమిళ జనాలు ఏం చేసినా కాస్త అతిగానే ఉంటుంది. వాళ్ల క్రియేటివిటీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడీ “అతి” అనే లక్షణం ఫ్యాన్ వార్ కు కూడా విస్తరించింది. హీరోల అభిమానులు పరస్పరం విమర్శలు చేసుకోవడం, రికార్డుల కోసం తిట్టుకోవడం కామన్. టాలీవుడ్ లో ఇది ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. ఇదే తరహా వివాదం కోలీవుడ్ లో కొత్తపుంతలు తొక్కింది. ఎంతలా అంటే ఏకంగా హీరో విజయ్ ను చంపేసే రేంజ్ కు వెళ్లిపోయింది.
కోలీవుడ్ లో రజనీకాంత్ తర్వాత స్థానం ఎవరిదనే చర్చ ఎప్పట్నుంచో నడుస్తోంది. ఈ రేసులో విజయ్, అజిత్ అందరికంటే ముందున్నారు. అందుకే ఈ ఇద్దరు హీరో అభిమానులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గొడవలు పడుతుంటారు. తమ హీరో నంబర్ వన్ అంటే, కాదు మా హీరో నంబర్ వన్ అంటూ కొట్టుకుంటుంటారు. తాజాగా అజిత్ అభిమానులు ఓ అడుగు ముందుకేశారు. #RipActorVijay అంటూ ఏకంగా ఓ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసి పడేశారు.
సింపుల్ గా చెప్పాలంటే అజిత్ ఫ్యాన్స్ అంతా కలిసి హీరో విజయ్ ను సోషల్ మీడియాలో చంపేశారన్నమాట. దీంతో విజయ్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. వాళ్లు కూడా అజిత్ ను నానారకాల మాటలు అనడం ప్రారంభించారు. ఇలా ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు.. ఏకంగా 4 రోజుల నుంచి ఈ సోషల్ మీడియా వార్ నడుస్తూనే ఉంది.
చివరికి ఇది ఏ స్థాయికి చేరిందంటే.. ఫ్యాన్స్ ను చల్లార్చడం కోసం మిగతా హీరోల ఫ్యాన్స్ కలుగజేసుకోవాల్సి వచ్చింది. కోలీవుడ్ పరువు తీసేలా వ్యవహరించొద్దని, హీరోలందర్నీ సమానంగా చూడాలంటూ విజయ్ సేతుపతి, విశాల్ అభిమానులు విజ్ఞప్తిచేస్తున్నారు. క్రికెటర్ అశ్విన్ రామచంద్రన్ కూడా ఈ పాడు ట్రెండింగ్ పై ఆగ్రహం వ్యక్తంచేశాడు.
టాలీవుడ్ లో చిరంజీవి తర్వాత ఆ స్థానం ఎవరిదనే చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కొంతమంది పవన్ అంటారు, మరికొందరు మహేష్ అంటారు. బాహుబలి వచ్చిన తర్వాత చాలామంది ప్రభాస్ అంటున్నారు. కానీ ఎప్పుడూ ఏ హీరో అభిమానులు ఇలా హద్దులు దాటలేదు. కేవలం రికార్డులు మాత్రమే ప్రస్తావించేవారు. కోలీవుడ్ లో మాత్రం ఈ పోటీ ఇలా శృతిమించి ఏకంగా విజయ్ కే శ్రద్ధాంజలి ఘటించే స్థాయికి చేరింది.