అన్ని లెక్కలున్నాయ్.. పరోక్షంగా జగన్ వార్నింగ్

సర్వే ప్రకారమే సీట్లు ఇస్తా.. తేడా వస్తే పక్కనపెడతా.. వైసీఎల్పీ మీటింగ్ లో జగన్ చెప్పిన మాటలివి. ఇంటింటికీ వెళ్లాలి, ప్రతి వాకిలి తట్టాలి, ప్రతి గడపా తొక్కాలంటూ జగన్ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం…

సర్వే ప్రకారమే సీట్లు ఇస్తా.. తేడా వస్తే పక్కనపెడతా.. వైసీఎల్పీ మీటింగ్ లో జగన్ చెప్పిన మాటలివి. ఇంటింటికీ వెళ్లాలి, ప్రతి వాకిలి తట్టాలి, ప్రతి గడపా తొక్కాలంటూ జగన్ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. చివరికి సర్వే ప్రకారమే సీట్లిస్తామని చెప్పారు. అంటే ఆయన దగ్గరకు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలందరి లెక్కలు చేరిపోతున్నాయని అర్థం. ప్రభుత్వ పథకాలతో బిజీగా ఉన్నారని అనుకున్నాం కానీ, పార్టీ విషయాల్లో జగన్ లెక్కలు వేరే ఉన్నాయి. ఆ లెక్కలన్నీ త్వరలో తేలుస్తారు.. అందరి లెక్కలు సరిచేస్తారు.

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కోసం కూడా జగన్ బాగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. అందర్నీ మార్చేస్తామని చెప్పినా.. ఒకరిద్దర్ని రాజకీయ సమీకరణాలతో కొనసాగిస్తానంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే కష్టపడండి అంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆదేశాలిచ్చరు జగన్. జనంలోకి వెళ్లకపోతే ఎంత మంచి ప్రభుత్వం అయినా, ఎంత మంచి పేరున్న ఎమ్మెల్యే అయినా విజయం సాధించడం కష్టం అని పరోక్షంగా హెచ్చరించారు.

ప్రజలు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి వేచి చూడటం కాదు, ఎమ్మెల్యేనే ప్రజలందరి ఇళ్లకు వెళ్లాలని చెప్పారు. సీఎంగా జగన్ ని మినహాయించి, గౌతమ్ రెడ్డిని తప్పించి చూసినా మిగతా 149మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే చాలామంది జనంలోకి వెళ్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలతో మమేకం అవుతున్నారు. కానీ కొంతమంది మాత్రం అధికారంలోకి వచ్చాం కదా అని ఇంటి పట్టునే ఉండిపోయారనే ఆరోపణలున్నాయి. కరోనాను సాకుగా చూపించినప్పటికీ.. ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకునేవారు, హైదరాబాద్ లోనే ఉండిపోయేవారు చాలామంది ఉన్నారు. వారందరికీ జగన్ ఇచ్చిన డైరెక్ట్ వార్నింగ్ ఇది.

దాదాపుగా ప్రతి జిల్లాలోనూ ఫలానా వారికి మళ్లీ టికెట్ రాదు అనే లిస్ట్ ఒకటి ఉంది. వారి గురించి దుర్భిణి వేసి వెదకక్కర్లేదు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా ఆ విషయం బాగా తెలుసు. కానీ జగన్ కి ఆ సమాచారం ఉందా, అధిష్టానం దగ్గర కూడా ఆ లెక్కలన్నీ ఉన్నాయా అనేది కొంతమంది అనుమానం. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ జగన్ క్లియర్ గా వైసీఎల్పీ మీటింగ్ లో తన మనసులో మాట చెప్పేశారు.

సర్వే ఫలితాలు తేడా వస్తే టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. అందరూ జనాల్లోకి వెళ్లాల్సిందేనని చెప్పారు. ఇప్పటికే ఆ పని చేస్తున్నవారు ఫుల్ ఖుషీ, కొత్తగా జనంలోకి వెళ్లాలనుకునేవారికి కాస్త ఇబ్బంది అయినా తప్పదు. లేదు, మేమింతే, మారేది లేదు, మా వ్యాపారాలు మావి, ఎన్నికలప్పుడు ఖర్చు పెట్టుకుంటాం అనుకునేవారిని మాత్రం జగన్ ఉపేక్షించేది లేదని తెలుస్తోంది. ఏదేమైనా.. 2024 వైసీపీ సీట్ల వ్యవహారం మాత్రం హాట్ హాట్ గా సాగుతుందనడంలో అనుమానం లేదు.