జగన్ ప్రభుత్వం సగం పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కొత్త కేబినెట్ ఏర్పాటు కానుంది. గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే సందర్భంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ …సగం పాలన పూర్తి అయిన తర్వాత మంత్రి వర్గాన్ని సమూలంగా మారుస్తానని, కొత్త వాళ్లకు అవకాశం ఇస్తానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో మంగళవారం జగన్ నిర్వహించిన సమావేశంలో మంత్రివర్గంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక సమీకరణల రీత్యా ఒకరిద్దరు మినహాయించి, మిగిలిన కేబినెట్ అంతటిని మార్చుతానని స్పష్టం చేశారు. ఆ ఒకరిద్దరిలో ఎవరెవరు? ఉంటారనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నానిని కొనసాగిస్తారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సామాజిక వర్గం రీత్యా తనను బద్ధ శత్రువుగా భావించే కమ్మ కులస్తుడు కావడంతో పాటు అన్నిటికి మించి ప్రత్యర్థులకు దీటుగా సమాధానం ఇచ్చే నాయకుడిగా కొడాలి నాని అంటే జగన్‌కు విపరీతమైన అభిమానం.
అంతెందుకు జనసేనాని పవన్‌కల్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి నిన్న కొడాలి ఇచ్చిన కౌంటర్ అదుర్స్ అనే రీతిలో ఉంది. జనసేన ఆవిర్భావ సభలో పవన్‌కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడమే జనసేన ఆవిర్భావ సభ లక్ష్యమని ప్రకటించారు.
రానున్న ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు వస్తాయని అచ్చెన్నాయుడు జోకేయడంపై కూడా కొడాలి నాని తన మార్క్ పంచ్‌లు విసిరారు. పవన్, అచ్చెన్నాయుడుపై కొడాలి పంచ్‌లు ఏంటో చూద్దాం.
” రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డిని ఢీ కొట్టగల మగాడు ఉంటే రాజకీయాల నుంచి తప్పుకొంటా. టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ.. ఏ పార్టీ అయినా సరే జగన్‌కు వ్యతిరేకంగా 160 సీట్లలో పోటీ చేయగల మగాడు ఎవడు ఈ రాష్ట్రంలో? ఆయన్ను కొట్టగల మగాడు, రాజకీయ పార్టీ ఉంటే.. నేను రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా. టీడీపీ 160 సీట్లలో సింగల్‌గా పోటీ చేసి, గెలిస్తే కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటా. జనసేన పార్టీ స్థాపించిందే చంద్రబాబు కోసమని చిన్న పిల్లలకు కూడా తెలుసు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేది లేదు.. చచ్చేది లేదని ” అని కొడాలి నాని దెప్పి పొడిచారు.
ఈ స్థాయిలో ప్రత్యర్థులను చీల్చి చెండాడే కొడాలి నానిని తప్పక కేబినెట్లో కొనసాగిస్తారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త కేబినెట్ కూర్పుపై జగన్ మనసులో ఏముందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.