మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు ప్రసంగం… భారీ ట్రోలింగ్‌కు కారణమైంది. జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన చూస్తుంటే సిగ్గేస్తోందని మండిపడ్డారు. ఒకవేళ మళ్లీ జగనే ముఖ్యమంత్రి అయితే సగం మంది రాష్ట్ర ప్రజలు కాందిశీకుల్లా పక్క రాష్ట్రాలకు వలస వెళతారని ఆందోళన చెందారు.
రాష్ట్ర ప్రజలు కాందిశీకుల్లా పక్క రాష్ట్రాలకు వెళ్లాలా, వద్దా అని తెలియడానికి ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కానీ పవన్‌ను అభిమానించే జనసేన కార్యకర్తలు, నాయకులకు మాత్రం ఇప్పుడే ఆ దుస్థితి దాపురించిందని నెటిజన్లు తమదైన స్టైల్‌లో ట్రోలింగ్‌కు దిగారు.
వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు, మళ్లీ చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్‌కల్యాణ్ నిర్ణయించుకున్న నేపథ్యంలో జనసేన కార్యకర్తలకు భవిష్యత్ ఏంటో దిక్కుతెలియని స్థితిలో ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో చీల్చనని చెబుతూనే, టీడీపీతో పొత్తుకు ద్వారాలు తెరిచే ఉన్నాయని ప్రకటించడం ద్వారా తన పార్టీ శ్రేణుల ఆకాంక్షలను, ఆశయాల్ని సమాధి కట్టిన ఘన చరిత్ర పవన్‌కే దక్కిందని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.
తమ అభిమాన హీరో, నాయకుడైన పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కంటున్న జనసైనికులకు పవన్ రోడ్ మ్యాప్ ఏంటో తెలిసిన తర్వాత ఒక రకమైన ప్రస్ట్రేషన్‌కు గురి అవుతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబు పల్లకీ మోయలేక, అలాగని జనసేనాని నిర్ణయాన్ని సమర్థించలేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు జనసేన కార్యకర్తలు, నాయకులు వలస వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని నెటిజన్లు సృజనాత్మక విమర్శలు, పంచ్‌లతో నాగబాబుపై ట్రోలింగ్‌కు దిగడం గమనార్హం.