పలు విషయాలపై తరచుగా కలుస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈసారి మరో కీలక భేటీకి సమాయత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ఈరోజు అత్యంత కీలకమైన భేటీ జరగనుంది. కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న నదీజలాల విభజన సమస్యతో పాటు.. గోదావరి జలాల ఎత్తిపోతలకు సంబంధించిన కీలకమైన అంశంపై జగన్-కేసీఆర్ ఈరోజు చర్చించబోతున్నారు.
తెలుగు రాష్ట్రాల నేతల మధ్య నదీజలాల సమస్యలు ఏ స్థాయిలో చిచ్చుపెట్టాయో అందరికీ తెలిసిందే. ఒకదశలో దేవినేని ఉమ, హరీష్ రావుతో పాటు… చంద్రబాబు-కేసీఆర్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. దీంతో ఈ సమస్యతో పాటు విభజన సమస్యలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అలా మూలనపడిన విభజన సమస్యలన్నింటినీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు సామరస్యంగా పరిష్కరించుకుంటున్నారు.
తెలంగాణలో ఉన్న ఆంధ్రా భవనాలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన ముఖ్యమంత్రులు ఈరోజు వృధాగా పోతున్న గోదావరి జలాల వినియోగంపై చర్చించనున్నారు. శ్రీశైలంలో ఏటా నీళ్లు అడుగంటుతున్న నేపథ్యంలో.. వృధాగా పోతున్న గోదావరి జలాల్ని కృష్ణా బేసిన్ లోకి ఎత్తిపోసే అంశంపై ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు.
శ్రీశైలంలో తగిన నీటి లభ్యత లేని కారణంగా ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతోంది. ట్రిబ్యునల్ చెప్పిన వాటా కంటే 30శాతం తక్కువగా జలాల లభ్యత ఉంటోంది. దీనివల్ల తాగునీటితో పాటు విద్యుత్ లోటు బాగా పెరిగిపోతోంది. దీనికి ఏకైక పరిష్కారం గోదావరి జలాల్ని కృష్ణా బేసిన్ లోకి ఎత్తిపోయడమే. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది కూడా మరో భారీ కాళేశ్వరం ప్రాజెక్టు లాంటిదన్నమాట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శాఖ అధికారులు సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి.
కీలకమైన ఈ సమస్యతో పాటు.. విద్యుత్ ఉద్యోగుల పంపిణీ, ఏపీ భవన్ విభజన, 142 సంస్థల ఆస్తుల పంపకం వంటి కీలకమైన అంశాలపై కూడా జగన్-కేసీఆర్ ఈరోజు విస్తృతంగా చర్చించబోతున్నారు. ఈరోజు సాయంత్రానికి చాలా అంశాలపై కీలక ప్రకటనలు రాబోతున్నాయి.