యూపీఐ విధానంలో చెల్లింపులు చేసే యాప్స్ ఇప్పటికే చాలా ఉన్నాయి. గూగుల్ పే, ఫోన్ పేతో పాటు దాదాపు ప్రముఖ బ్యాంకులన్నీ యూపీఐ విధానంలో చెల్లింపులు చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టాయి. వాట్సాప్ కూడా చాన్నాళ్ల కిందటే ప్రయోగాత్మకంగా పేమెంట్ సెక్షన్ స్టార్ట్ చేసింది. కాకపోతే దాన్ని ఆర్బీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎట్టకేలకు ఈ సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చాయి.
ఇకపై వాట్సాప్ లో కూడా ఇనిస్టెంట్ గా నగదు బదిలీ చేసుకోవచ్చు. చెల్లింపులు జరుపుకోవచ్చు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా భారతీయ వినియోగదారుల డేటాను దేశం ఆవల స్టోర్ చేసింది వాట్సాప్. దీనిపై ఆర్బీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎవరైనా తమ వినియోగదారుల డేటాను ఇండియాలోనే భద్రపరచాలని ఆదేశించింది. ఇది చాలా ఖర్చుతో కూడుతున్న వ్యవహారం కావడంతో దీనిపై చాలా సంస్థలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. అయితే ఆర్బీఐ మాత్రం ఈ విషయంలో వెనక్కితగ్గలేదు.
దీంతో అమెజాన్, గూగుల్ లాంటి చాలా సంస్థలు ఈ దిశగా దేశంలోనే డేటా సెంటర్ ను ఏర్పాటుచేసుకున్నాయి. ఇప్పుడు వాట్సాప్ కూడా దేశీయంగానే డేటా సెంటర్ ను ఏర్పాటుచేసుకుంటోంది. దీంతో వాట్సాప్ పేమెంట్ సేవలు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
వాట్సాప్ ను ఫేస్ బుక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని సర్వీసుల్ని కూడా అమెరికా కేంద్రంగానే నడపాలని భావించింది. కానీ సమాచార గోప్యత విషయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా వివాదాలు ఎదుర్కొంటోంది ఫేస్ బుక్. దీన్ని దృష్టిలో పెట్టుకొని, వాట్సాప్ విషయంలో ఆర్బీఐ చాలా కఠినంగా వ్యవహరించింది.
ఎట్టకేలకు వాట్సాప్ దారిలోకొచ్చింది. ఇండియాలోనే డేటా సెంటర్ ను ఏర్పాటుచేస్తోంది. వాట్సాప్ పేమెంట్ అందుబాటులోకి వస్తే చెల్లింపులు, బదిలీ లాంటి ప్రక్రియలు మరింత సులభం అవుతాయని నిపుణులు భావిస్తున్నారు.