ఓడిపోయిన తర్వాత విశ్లేషణలు చేయాల్సింది ఎవరితో? అందుబాటులో ఉన్న ఇద్దరు ముగ్గురు నేతల్ని పిలిపించి ఓటమికి కారణాలు అడిగితే రివ్యూ పూర్తయినట్టా? అదసలు సమీక్ష అనిపించుకోదు. నిజంగా ఓటమికి కారణాలు తెలియాలంటే క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అలా తెలియాలంటే కార్యకర్తల్నే అడగాలి. ఇప్పుడు ఇదే పని చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్టు 3 స్థానాలు కూడా తెచ్చుకోలేకపోయింది. కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టింది. అది ఎంత ఘోరమైన ఓటమి అంటే.. చివరికి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా తను పోటీచేసిన రెండు స్థానాల నుంచి ఓడిపోయారు. ఈ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పవన్… అసలు జనసేన పార్టీ ఎందుకింత ఘోరంగా ఓడిపోయిందో తెలుసుకోవాలనుకున్నారు. వరుసగా మీటింగ్స్ పెట్టారు. కానీ ఆ సమావేశాలతో ఆయనకు క్లారిటీ రాలేదు.
అందుకే నేరుగా కార్యకర్తల్నే కలవాలని నిర్ణయించుకున్నారు పవన్. వివిధ నియోజకవర్గాల్లో కీలకంగా పనిచేసిన జనసైనికులతో నేరుగా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు పవన్. కొన్ని సెగ్మెంట్లలో నియోజకవర్గ స్థాయిలో, మరికొన్ని సెగ్మెంట్లలో మండలాల స్థాయిలో జనసైనికుల్ని పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు. జులై మొదటి వారం నుంచి జరగనున్న ఈ సమావేశాల్లో అసలైన వాస్తవాలు బయటపడబోతున్నాయి. జనసేన ఎందుకింత ఘోరంగా ఓడిపోయిందో పవన్ కు అప్పుడు తెలుస్తుంది.
మొత్తానికి పవన్ కైతే జ్ఞనోదయమైంది. కానీ ఈ విషయంలో చంద్రబాబుకు మాత్రం ఇంకా జ్ఞానోదయం అయినట్టు కనిపించలేదు. ఓడిపోయినప్పటికీ ఇంకా తనే కింగ్ అనే భ్రమలో ఉన్న బాబు.. కొంతమంది ప్రజల్ని తన కార్యాలయానికి రప్పించుకొని వాళ్లతో ఓదార్పులు చేయించుకుంటున్నారు. మరోవైపు అందుబాటులో ఉన్న నేతలతో “ఓటమిపై విశ్లేషణ” అంటూ మీటింగ్స్ పెట్టి మమ అనిపిస్తున్నారు. ఓటమికి అసలైన కారణాలు మాత్రం బాబుకు ఇంకా తెలిసొచ్చినట్టు లేదు.
టీడీపీ ఎందుకింత ఘోరంగా ఓడిపోయిందో, కేవలం 23 స్థానాలకే ఎందుకు పరిమితమైపోయిందో తెలియాలంటే.. చంద్రబాబు కూడా పవన్ దారిలో నడవాలి. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశమవ్వాలి. అప్పుడే అసలు విషయాలు బయటపడతాయి. అది చేయకుండా నియోజకవర్గాల నుంచి ఎన్ని నివేదికలు తెప్పించుకున్నా, ఓడిన ఎమ్మెల్యేలతో ఎన్ని మీటింగ్స్ పెట్టినా ప్రయోజనం ఉండదు. మరి ఈ విషయాన్ని చంద్రబాబుకు ఎవరైనా చెబితే బాగుండు.