విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ జరిపిన సమీక్షలో అధికారులు అన్ని లోటుపాట్లను ఆయన ముందుంచారు. ఉపాధ్యాయుల కొరత, తరగతి గదుల కొరత, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేకపోవడం.. వీటి వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడంలేదని లెక్కకట్టారు. ఆర్వో వాటర్ ప్లాంట్లకు బడ్జెట్, అదనపు తరగతి గదులకు, మరుగుదొడ్ల నిర్మాణానికి… కేటాయింపులు జరపాలంటూ ప్రతిపాదనలు పెట్టారు. నిజంగా ఇవన్నీ చేస్తే ప్రభుత్వ బడులు బాగుపడతాయా? విద్యార్థులు క్యూ కడతారా?
ఇప్పుడున్న చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు.. గతంలో ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకున్నారు. అప్పుడు ఒకటే గది ఉండేది, మిగతా క్లాస్ లన్నీ చెట్ల కింద, వరండాల్లో సాగిపోయేవి. ఆర్వో ప్లాంటు అంటేనే తెలియదు. ఏ చేతి పంపు నీళ్లో తాగి దాహం తీర్చుకునేవారు. మరుగుదొడ్లు అనే కాన్సెప్టే లేదసలు. అలాంటి టైమ్ లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ తో కిటకిటలాడేవి. మరిప్పుడు ఏమైంది? దీనిపైనే మేథావులు, అధికారులు దృష్టిపెట్టాలి. సమగ్రమైన రిపోర్ట్ సీఎం చేతికివ్వాలి. అంతేకానీ ఆ కొరత, ఈ కొరత అంటూ మభ్యపెట్టే విషయాలను పైకి తెచ్చి అసలు విషయాలు తెలియనట్టు నటిస్తే మాత్రం ప్రభుత్వ బడులకు సెంట్రల్ ఏసీ పెట్టించినా స్టూడెంట్స్ రారు.
అధికారులు చెబుతున్నట్టు ప్రభుత్వ బడులకు వసతులు కావాల్సిందే. మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాల్సిందే. కానీ వాటితో పాటు బడుల మెరుగుకు మరిన్ని చర్యలు చేపట్టాలి. మరీ ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలపై కచ్చితంగా నియంత్రణ విధించాలి. వీధికో ప్రైవేట్ స్కూల్, ఊరికో కార్పొరేట్ సీబీఎస్సీ స్కూల్ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో వాటికి అనుమతులు, వాటి నియంత్రణపై పూర్తి స్థాయిలో దృష్టిపెడితేనే ప్రభుత్వ బడులు బాగుపడతాయి.
ఇప్పటికీ పల్లెటూళ్లలో ప్రైవేట్ హవా అంతగా లేని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు పిల్లలతో కిటకిటలాడుతున్నాయి. నెల్లూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం వంటి కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్కూల్స్ కి నో అడ్మిషన్ బోర్డ్ లు పెడుతున్నారంటే అక్కడ ఉపాధ్యాయుల అంకితభావం, వారి కృషి ఎన్నదగినది. అలాంటి పరిస్థితులు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో రావాలి. ప్రైవేట్ స్కూల్స్ లో లాగే.. ప్రతి విద్యార్థి ప్రోగ్రెస్ ని నిత్యం వారి తల్లిదండ్రులతో చర్చించడం, నిరంతర మూల్యాంకనం వంటివి ఉంటేనే ప్రభుత్వ బడులు బాగుపడతాయి. అంతేకానీ ఆర్వో ప్లాంట్లు, అదనపు గదులతో పరిస్థితుల్లో ఊహించినంత మార్పయితే రాదు.
ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు పెంచడంతో పాటు.. ప్రైవేట్ దూకుడుని అడ్డుకోవడం, ఫలితాలతో పోటీపడడం, తగినంత ప్రచారం చేసుకోవడం లాంటివి చేస్తేనే ప్రాధామిక విద్యలో ప్రమాణాలు పెరుగుతాయి. అమ్మఒడి వంటి పథకాలకు అప్పుడే సార్థకత చేకూరుతుంది. ఇవి జరగకుండా ఎన్ని సమీక్షలు జరిపినా అవి వృథాగానే మిగిలిపోతాయి.