తాజాగా థియేటర్లలోకి వచ్చిన మన్మథుడు-2 సినిమాను తన గత చిత్రాలతో కంపేర్ చేయొద్దని చెబుతూనే.. తన గత చిత్రాలన్నింటినీ ప్రస్తావించాడు నాగార్జున. అప్పట్లో గీతాంజలి, శివ, నిర్ణయం లాంటి సినిమాల విషయంలో ప్రారంభంలో మిక్స్ డ్ టాక్ వచ్చిందని, తర్వాత అవే క్లాసిక్స్ గా నిలిచాయని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే మన్మథుడు లాంటి మంచి సినిమాను నాగ్ చెడగొట్టాడని ఫ్యాన్స్ ఫీలవుతుంటే.. ఇప్పుడు స్వయంగా అతడే గీతాంజలి సినిమాను కూడా ప్రస్తావించి, కంపారిజన్స్ తీసుకురావొద్దని కోరుతున్నాడు.
మరోవైపు మన్మథుడు-2పై వస్తున్న కామెంట్స్ పై కూడా స్పందించాడు నాగ్. సినిమాలో ఉన్న అడల్ట్ సన్నివేశాలు, లిప్ కిస్సుల్ని తనదైన స్టయిల్ లో సమర్థించుకున్నాడు. ఫ్యామిలీస్ లో రొమాన్స్ ఉంటుంది కాబట్టి, ఈ రొమాంటిక్ సినిమాకు కూడా ఫ్యామిలీస్ వస్తారని కొత్త లాజిక్ తీశాడు.
“నాకు రొమాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే అలా చేశాను. ఇబ్బందికరంగా ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రారు. ఆ విషయం నాకు తెలుసు, ఫ్యామిలీ ఆడియన్స్ కు తెలుసు. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా వస్తారు, చూస్తారు. రొమాన్స్ ఉంటేనే కదా ఫ్యామిలీ.”
మన్మథుడు-2కు ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ ఉందని, ఇండస్ట్రీలో మాత్రం కొంతమంది డివైడ్ టాక్ తీసుకొచ్చారని సున్నితంగా ఆరోపిస్తున్నాడు నాగార్జున. ప్రేక్షకుల్లో నెగెటివ్ టాక్ ఉంటే వసూళ్లు ఈ రేంజ్ లో రావని, కేవలం పరిశ్రమలో డివైడ్ టాక్ ఉందని, అది కూడా కొన్నిరోజుల తర్వాత పాజిటివ్ టాక్ గా మారిపోతుందంటున్నాడు.
“సినిమా కొత్తగా ఉంది. న్యూ ఏజ్ సినిమా అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అదే టాక్ కంటిన్యూ అయితే ఇండస్ట్రీలో ఉన్న డివైడ్ టాక్ కూడా మారిపోయి పాజిటివ్ గా మారిపోతుంది. ఈ సినిమాకు మన్మథుడు-2 అనే టైటిల్ పెట్టడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. ఇంకొంత ప్లస్ కూడా అవుతుంది. కెరీర్ స్టార్టింగ్ లో నాగేశ్వరరావు గారి అబ్బాయి నాగార్జున అనే ఇమేజ్ నాకు కొంత ఇబ్బంది అయింది. తర్వాత ప్లస్ అయింది. ఇది కూడా అలాంటిదే.”
గీతాంజలి సినిమా రిలీజైన తర్వాత ఫ్లాప్ టాక్ వచ్చిందని, చాలాచోట్ల థియేటర్ యాజమాన్యాలే సొంతంగా సెన్సార్ చేసుకొని సినిమాను ప్రదర్శించుకున్నారని చెప్పిన నాగార్జున.. మన్మథుడు-2పై వస్తున్న విమర్శలు కూడా కొన్నాళ్లకు తగ్గి, గీతాంజలి టైపులో హిట్ అవుతుందంటున్నాడు.