ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి జగన్ సర్కార్ చెక్ పట్టింది. ట్రీట్‌మెంట్ పేరుతో కరోనా బాధితులను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు జగన్ ప్రభుత్వం షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చింది. అధిక ఫీజుల పేరుతో కరోనా బాధితులను దోచుకోవాలని భావించే మెడికల్ ముఠాకు జగన్ సర్కార్ తాజా చర్య ఓ హెచ్చరిక అని చెప్పొచ్చు.
కరోనా బాధిత కుటుంబం నుంచి అదనంగా వసూలు చేసిన ఆస్పత్రికి పది రెట్లు అదనంగా జరిమానా విధించడంతో పాటు తిరిగి ఆ సొమ్మును వెనక్కి ఇప్పించిన ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కింది.
కరోనా చికిత్సకు ఎంతెంత తీసుకోవాలో జగన్ ప్రభుత్వం అన్ని ఆస్పత్రులకు దిశానిర్దేశం చేసింది. అయితే బాధితుల ప్రాణభ యాన్ని, మహమ్మారి దాడిని సొమ్ము చేసుకునే క్రమంలో ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ ఆదేశాలను భేఖాతరు చేశాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సాయిసుధ ఆస్పత్రి దారుణానికి పాల్పడింది. కాకినాడకు చెందిన ఓబిలిశెట్టి సత్యనారాయణ కరోనా ట్రీట్‌మెంట్ నిమిత్తం గత నెల 14న ఆ ఆస్పత్రిలో చేరాడు.
మహమ్మారిపై పోరాటంలో ఆయన ఓడిపోయాడు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. చికిత్స నిమిత్తం రూ.14 లక్షలు బిల్లు వేశారు. ఈ విషయమై ఆస్పత్రి యాజమాన్యాన్ని బాధిత కుటుంబం ప్రశ్నించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి రూ.14 లక్షలు చెల్లించి శవాన్ని తెచ్చుకోవాల్సి వచ్చింది. భారీ మొత్తంలో వసూలు చేయడంపై బాధితుడి కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి యాజమాన్యంపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంపై కలెక్టరేట్‌లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్, జేసీ కీర్తి అధ్యక్షతన విచారణ నిర్వహించారు. దీనికి ఆస్పత్రి ప్రతినిధులు హాజరయ్యారు. బాధిత కుటుంబం నుంచి రూ.3.16 లక్షలే తీసుకోవాల్సి ఉండగా, రూ.10.84 లక్షలు అదనంగా వసూలు చేశారని నిర్ధారించారు. దీంతో ఆస్పత్రి నిర్వాకంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అదనంగా వసూలు చేసిన సొమ్ముకు ఏడు రెట్లు అంటే ,రూ.75.88 లక్షలు జరిమానా విధించారు. ఆ మొత్తానికి కలెక్టర్‌కు చెక్కు అందజేసింది.
అంతటితో ప్రభుత్వం తన బాధ్యత తీరిందని భావించలేదు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంది. బాధిత కుటుంబం నుంచి అదనంగా వసూలు చేసిన రూ.10.84 లక్షల మొత్తానికి కూడా చెక్కును రాబట్టింది. దాన్ని కలెక్టరేట్‌లో అందజేశారు. దీంతో రాష్ట్రంలో ఏ ఆస్పత్రి అయినా అధిక మొత్తంలో వసూలు చేస్తే ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందనే హెచ్చరిక పంపినట్టైంది.