జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై టీడీపీ వితండ వాదం చేస్తోంది. టీడీపీ నేతల మాటల్లోనే తమ హయాంలో ఆ ప్రాజెక్టు ప్రగతి ఏంటో తెలిసిపోతోంది. అధికారంలో ఉండగా పోలవరాన్ని కేవలం ప్రచారం కోసం టీడీపీ వాడుకుందనే విమర్శలు లేకపోలేదు. వారం వారం పోలవరం పేరుతో చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
అలాగే గత సార్వత్రిక ఎన్నికల ముందు పోలవరం పూర్తి చేశామనే భ్రమ కల్పించేందుకు ప్రభుత్వ సొమ్ముతో పెద్ద ఎత్తున అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి జనాన్ని తరలించి, దేవతావస్త్రాలను మరిపించారు. వాస్తవాలు ఇట్లా ఉండగా, జలవనరులశాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వంపై తాజా విమర్శలు టీడీపీ నిజ స్వరూపాన్ని కళ్లకు కడుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు పనులు టీడీపీ హయాంలోనే 72 శాతం పూర్తయ్యాయని దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనతో సీఎం జగన్ ప్రాజెక్టు నిర్మాణానికి ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. ఆయనకు ధైర్యముంటే తన ఢిల్లీ పర్యటన వివరాలను మీడియా సాక్షిగా వెల్లడించాలని సవాల్ చేశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరానికి ఖర్చు చేసిన రూ.4,347 కోట్లను కేంద్రం గత రెండేళ్లలో విడుదల చేసిందన్నారు. ఆ మొత్తాన్ని జగన్ ఎవరికిచ్చారని ప్రశ్నించారు. పోలవరం డ్యాంలో రూ.800 కోట్ల వరకు ఖర్చు పెట్టిన వారు …18,500 నిర్వాసి తుల కుటుంబాలను ఎందుకు గాలికొదిలేశారని మాజీ మంత్రి ప్రశ్నించారు.
మాజీ మంత్రి విమర్శలు…పోలవరం విషయంలో గత ప్రభుత్వ నాటకాలను దిగంబరంగా నిలబెట్టాయి. నిర్వాసితులకు ఏమీ చెల్లించకుండానే 72 శాతం పనులు ఎలా పూర్తి చేశారో దేవినేని సమాధానం చెప్పాలి. నిర్వాసితులను తమ ప్రభుత్వం గాలికొది లేసిందనే వాస్తవాన్ని దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పకనే చెప్పారు. పోలవరం ప్రాజెక్టు టీడీపీ కాంట్రాక్టర్లకు సంపాదన దోచి పెట్టే వరమైందే తప్ప, ప్రజానీకానికి శాపంగా మారింది.
తమ హయాంలో దాదాపు పోలవరాన్ని పూర్తి చేసినట్టు గణాంకాలు చెబుతూ బిల్డప్ ఇస్తున్న దేవినేనికి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలనే స్పృహ ఎందుకు లేకపోయిందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాల్సిన ప్రాజెక్టును అనవసరంగా తాము తీసుకోవడం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టాన్ని కలిగించామనే చేదు నిజాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకున్నారు.
కానీ వాస్తవాలేంటో ఏపీ ప్రజానీకానికి బాగా తెలుసు. దొంగే దొంగా దొంగా …అని కేకలు వేసిన చందంగా పోలవరం విషయంలో టీడీపీ అరుపులున్నాయి. ఇప్పటికైనా చేసిన తప్పునకు క్షమాపణ చెప్పి, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.