తాను ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ ప్రజాప్రతినిధులు చేసిన దాష్టీకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ మాత్రం మరిచిపోలేదు. మరీ ముఖ్యంగా నాటి మంత్రి అచ్చెన్నాయుడు అధికారం శాశ్వతమన్నట్టు జగన్‌పై ఎంతగా రెచ్చిపోయాడో అందరికీ తెలిసిందే. నువ్వు మగాడివైతే, రాయలసీమలో పుట్టింటే, అలాగే సమయం లేదు…సమరమా, లొంగుబాటా?…అంటూ జగన్‌ను పదేపదే రెచ్చగొడుతూ అచ్చెన్న అవమానించేవారు.
ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న అచ్చెన్నకు ఆ బాధ ఏంటో జగన్ రుచి చూపిస్తున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేల మాదిరిగా దూషణలకు దిగకుండా వ్యంగ్యంగా, నవ్వుతూ నవ్వుతూనే మాటలతోనే కుళ్లపొడుస్తుండడం విశేషం. ఇవాళ ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. ఆ మేరకు ప్లానింగ్ సిద్ధం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో బీఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. ఒక్కరోజే సభ నిర్వహిస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇందుకు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అంగీకరించలేదు. చాలా సమస్యలపై చర్చించాల్సి వుందని, కావున 15 రోజులు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నపై జగన్ సెటైర్ విసిరారు.
పెద్దాయన ప్రత్యేకంగా అడుగుతున్నప్పుడు అంగీకరించకపోతే ఎలా అంటూ సీఎం జగన్ వ్యంగ్యంగా అన్నారు. గతంలో బాడీ కాదు… బుర్ర పెంచుకో అచ్చెన్నా అని అసెంబ్లీ వేదికగా జగన్ అన్న మాటలను నెటిజన్లు గుర్తు చేస్తుండడం గమనార్హం.
పెద్దాయన అంటే ఏ అర్థంలో అన్నారో అచ్చెన్నకు మాత్రమే అర్థమై ఉంటుంది. మొత్తానికి ఆరు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 26వ తేదీ వరకూ సభ నిర్వహించనున్నట్టు స్పీకర్ వెల్లడించారు.