అవినీతిరహిత పాలన అందిస్తానన్న జగన్ చెప్పిన మాటల్ని చేతల్లో చూపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుపై మాత్రమే కాకుండా.. వివిధ రంగాల్లో పేరుకుపోయిన అవినీతిని వెలికితీసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా జగన్ చేసిన ఓ వ్యాఖ్య, సంచలనం సృష్టించింది.
తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిపుణుల కమిటీతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అవినీతి విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించాలని, కొన్నాళ్లు కళ్లు మూసుకోవాలని తనకు కొంతమంది ఉచిత సలహా ఇచ్చినట్టు ప్రకటించిన సంచలనం సృష్టించారు. అయితే తనకు ఆ సలహా ఇచ్చిన వ్యక్తుల పేర్లను మాత్రం సీఎం బయటపెట్టలేదు.
అందర్లా తను కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తే రాష్ట్రం మరింత కష్టాల్లో పడుతుందని, అందుకే అవినీతిని వెలికితీసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటుచేశానని సీఎం ప్రకటించారు. ఆ కమిటీకి విశేష అధికారాల్ని కూడా కట్టబెట్టారు. తొలి ప్రాధాన్యంగా పోలవరం ప్రాజెక్టులో అవినీతిని నిగ్గుతేల్చాలని కమిటీని ఆదేశించారు జగన్. 4 నెలల్లో పోలవరం టెండర్లలో జరిగిన అక్రమాల వివరాలు తనకు తెలియాలని, ఏఏ టెండర్లను మళ్లీ (రివర్స్-టెండరింగ్) పిలవాలో చెప్పాలని సూచించారు.
పోలవరం ప్రాజెక్టు తర్వాత పట్టణాల్లో నిరుపేదల ఇంటి నిర్మాణాలకు సంబంధించిన ప్రక్రియపై దృష్టిసారించాలని, ఆ తర్వాత హంద్రీనీవా, వంశధార ప్రాజెక్టు పనులపై కన్నేయాలని కమిటీకి ముఖ్యమంత్రి సూచించారు. ఇలా దశలవారీగా ఒక్కో శాఖలో అవినీతి చిట్టాను బయటకు తీయాలని జగన్ నిర్ణయించారు. ఆ తర్వాత సంబంధిత అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తారు.
సోమవారం నుంచి నిపుణుల కమిటీ తన పనిని ప్రారంభిస్తుంది. ఒకటి పూర్తయిన తర్వాత మరొకటి టేకోవర్ చేసే విధానానికి స్వస్తి చెప్పి.. కమిటీలో నిపుణులు గ్రూపులుగా విడిపోయి, సమాంతరంగా ఆడిట్ చేయాలని నిర్ణయించారు. అవసరమైతే ప్రతి గ్రూపులో కమిటీ సభ్యులు.. తమకు అనుబంధంగా సబ్-గ్రూపులు నియమించుకోవచ్చు. ఈ మేరకు జగన్ వాళ్లకు పూర్తి అధికారులు ఇచ్చారు.
ఇక్కడ జగన్ తీసుకున్న ఓ నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అదేంటంటే.. నిపుణులు ఏం చేసినా పారదర్శకంగా చేయాలని జగన్ సూచించారు. ఎక్కడా గోప్యత అనే పదానికి తావులేకుండా, అందరికీ అందుబాటులో ఉండేలా నిపుణుల కమిటీ అధ్యయనం ఉండాలన్నారు. వ్యక్తిగత కక్షలకు తావులేకుండా, రివర్స్-టెండరింగ్ ప్రాసెస్ ను పూర్తిచేస్తే అవినీతి దానికదే తగ్గుతుందని జగన్ భావిస్తున్నారు.