రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. కేలండర్లో తేదీలు మారినంత ఈజీగా.. నాయకులు పార్టీలు మారుతున్నారు. రాష్ట్రంలో బలంలేని బీజేపీ.. ఎవరొచ్చినా తమలో కలిపేసుకోడానికి సిద్ధంగా ఉంది. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పార్టీలో చేరితే ఏంలాభం ఉంటుంది? అయినా కూడా సాక్షాత్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా ఆమెకు ఎర్రతివాచీ పరిచి, కాషాయ కండువా కప్పారు.
ఇటీవలే నలుగురు రాజ్యసభ టీడీపీ సభ్యులు కూడా గోడ దూకారు. ఇలా బలం బలం అంటూ కలవరిస్తున్న కమలదళం.. ఎవరొచ్చినా కండువా కప్పేసి ప్రచారం చేసుకోవాలని చూస్తోంది. ఈ కోవలోనే కాంగ్రెస్ నేతలకు కూడా గాలమేస్తోంది. అందులో కీలకమైన వ్యక్తి రఘువీరా రెడ్డి.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ముక్కచెక్కలైపోయిన కాంగ్రెస్ లో అక్కడక్కడా రఘువీరా రెడ్డి వంటి నేతలు ఇంకా మిగిలే ఉన్నారు. మొన్నటి ఎన్నికలతో అలాంటి వాళ్ల ఆశలు కూడా నీరుగారిపోయాయి. కాంగ్రెస్ లో ఉంటే ఇక తమకు భవిష్యత్తు లేదని వాళ్లకు అర్థమైపోయింది. అందుకే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అయి ఉండి కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమౌతున్నారు రఘువీరా.
కల్యాణ దుర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన రఘువీరాకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం ఏమాత్రం ఇష్టంలేదు. అందుకే ఇటీవల పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. టీడీపీ ఫిరాయింపులపై కూడా నోరు మెదపలేదు. ఆయన తరపున పార్టీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి పేరుతోటే ప్రెస్ నోట్లు విడుదలవుతున్నాయి. దీంతో దాదాపుగా రఘువీరా కాంగ్రెస్ కి దూరమై, బీజేపీకి దగ్గరవుతున్నారని అర్థమవుతోంది.
రేపోమాపో ఢిల్లీ వెళ్లి అమిత్ షా సమక్షంలో రఘువీరా రెడ్డి బీజేపీలో చేరతారని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఇప్పటికే బీజేపీ దగ్గర కాంగ్రెస్ సీనియర్ బ్యాచ్ అలా పోగుపడి ఉంది. వారితో ఏపాటి లాభముందో ఈ ఎన్నికల్లో క్లియర్ గా తేలిపోయింది. కేవలం పార్టీ పేరుతో ఇన్నాళ్లూ గెలిచినవీరంతా సొంత బలంతో గెలవాల్సిన పరిస్థితులొచ్చే సరికి తేలిపోతున్నారు. రఘువీరా రెడ్డి కూడా అదే బ్యాచ్. మా పార్టీలో ఇంతముంది ఉన్నారని చెప్పుకోడానికి మినహా.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఈ కొత్త బీజేపీ నేతలంతా నోటాతో పోటీపడాల్సిందే.