విశాఖను పాలనా రాజధానిని చేసిన ముఖ్యమంత్రి జగన్ ఇపుడు ప్రగతి సొబగులను అద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రతీ సమీక్షా సమావేశంలోనూ విశాఖ అభివృద్ధి కార్యాచరణను ముందుకు తెచ్చి ప్రస్తావిస్తూ అధికార యంత్రాంగాన్ని అలెర్ట్ చేస్తున్నారు.
విశాఖకు తాగు సాగు నీరు కోసం పోలవరం నుంచి పైపు లైన్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని వైసీపీ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిని టైం బాండ్ ప్రొగ్రాంగా చేపట్టాలని జగన్ అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేయడం విశేషం.
ఇక భోగాపురం అయిర్ పోర్టుని రెండేళ్ళ వ్యవధిలో పూర్తి చేయాలని కూడా కచ్చితమైన టైం టేబుల్ ని అధికారులకు జగన్ ఇచ్చేశారు. అంతే కాదు, భోగాపురం నుంచి విశాఖ బీచ్ రోడ్డు వరకూ రోడ్ కనెక్టివిటీని తీసుకురావాలని, మొత్తం బీచ్ రోడ్డు ప్రాంతాన్ని సుందరీకరణ చేయాలని కూడా జగన్ అధికారులను ఆదేశించారు.
ఇక శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టుని రెండున్నరేళ్ళ కాలపరిమితితో పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. ఇక కొత్త ఏడాది వీటన్నిటికీ సంబంధించి శంఖుస్థాపన చేయడానికి జగన్ రెడీ అవుతున్నారు. జనవరి పండుగ తరువాత వరసగా విశాఖ సహా ఉత్తరాంధ్రా అభివృద్ధికి జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు.