కొత్త కేబినెట్ కూర్పులో సొంత సామాజిక వర్గంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పేచీ అని సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి విడతలో నలుగురు రెడ్లు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డిలకు స్థానం కల్పించారు. వీరిలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని తిరిగి కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతి చెందారు. మిగిలిన ఇద్దరు తప్పుకోవాలని జగన్ ఆదేశించినట్టు సమాచారం. అయితే తనకు తిరిగి అవకాశం ఇవ్వాలని జగన్ సమీప బంధువైన బాలినేని గట్టిగా డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఆ పప్పులేమీ ఉడికేలా లేవు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో రెడ్ల సామాజిక వర్గానికి ప్రాధాన్యం తగ్గించాలని జగన్ యోచిస్తున్నారని సమాచారం.
ఎటూ ముఖ్యమంత్రే రెడ్డి సామాజిక వర్గమైనప్పుడు, మంత్రి పదవుల్లో కోత విధిస్తే ఎలా వుంటుందని ఆయన యోచిస్తు న్నారని సమాచారం. సొంత సామాజిక వర్గంలో కోత విధించి, బీసీ, ఎస్సీ, ఇతర వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సామాజిక సమీకరణను పకడ్బందీగా అమలు చేసినట్టు అవుతుందని జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే ఈ దఫా రెడ్డను ముగ్గురికే పరిమితం చేయాలని ఆయన ఆలోచిస్తున్నారని తెలిసింది.
ఒకవేళ నలుగురు రెడ్లకు అవకాశం ఇవ్వాల్సి వస్తే, ఒక మహిళను తీసుకోనున్నారు. మరి ముఖ్యంగా ఈ దఫా ఐదుగురు మహిళలకు కేబినేట్ లో ఆవకాశం ఇవ్వాలని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే నగరి ఎమ్మెల్యే రోజా చాన్స్ కొట్టినట్టే. రోజా విషయంలో సొంత సామాజిక వర్గానికి చెందిన పెద్దాయన అడ్డు తగులుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే జగన్ అనుకుంటే ఆమె చిరకాల కోరిక నెరవేరే అవకాశం ఉంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి కూడా అవకాశం దక్కనుంది. అయితే తనకు, మంత్రి పదవికి ఆకాశమంత దూరమని సన్నిహితుల వద్ద కరుణాకరరెడ్డి చెబుతున్నట్టు సమాచారం. జగన్ కొత్త కేబినెట్లో అన్నీ అనుకున్నట్టు జరిగితే… బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆర్కే రోజాను మంత్రి పదవులు వరించనున్నాయి.