జగన్ కేబినెట్ పునర్వ్యస్థీకరణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మంత్రుల రాజీనామాలపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నెల 27న మంత్రులు రాజీనామాలు చేస్తారని, కొత్త కేబినెట్ ఏప్రిల్ 2న ఉగాదికి కొలువుతీరుతుందనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఆ గడువు సమీపించినా, రాజీనామాల వాతావరణం కనిపించలేదు. దీంతో కొత్త తేదీలు తెరపైకి వస్తున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే ఏదైనా అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 2న ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల నుంచి పాలన మొదలవుతుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కొత్త జిల్లాలకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలపై ప్రభుత్వం సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. మరో మూడు నాలుగు రోజుల్లో కొత్త జిల్లాలపై ప్రభుత్వం ప్రకటన ఇవ్వనుంది.
కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకుని మంత్రి వర్గం కూర్పు వుంటుందనే చర్చ జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఇంత వరకూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త కేబినెట్ కూర్పుపై ఎలాంటి కరసత్తు చేయలేదన్నారు.
కొత్త మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారనేది ఒక్క జగన్‌కు తప్ప రెండో మనిషికి తెలియదని సజ్జల చెప్పడం గమనార్హం. అంతా ఒకట్రెండు రోజుల్లో మంత్రి వర్గాన్ని సెట్ చేస్తారని మీడియా ప్రతినిధులతో జరిగిన ఫ్రెండ్లీ సంభాషణలో సజ్జల చెప్పారు. ఈ నేపథ్యంలో ఉగాది తర్వాత కొత్త కేబినెట్ ముందుకు రానుంది. ఏప్రిల్ రెండో వారంలో నూతన కేబినెట్ కొలువు తీరే అవకాశం ఉన్నట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.