వైఎస్ జగన్.. తక్షణ సాయానికి పర్యాయ పదం

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందిపడుతున్న బాధితులను తక్షణం పునరావాస శిబిరాలకు తరలించాలని. వారికి వసతి, భోజన…

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందిపడుతున్న బాధితులను తక్షణం పునరావాస శిబిరాలకు తరలించాలని. వారికి వసతి, భోజన ఏర్పాట్లతో పాటు వెయ్యి రూపాయలు సాయం అందించాలని సూచించారు. ఆర్థిక సాయం విషయంలో ఆలస్యం చేయొద్దని కలెక్టర్లకు ప్రత్యేకంగా గుర్తు చేశారు జగన్.

చంద్రబాబు హయాంలో ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటే.. ఆయన సాయం కోసం కేంద్రం వైపు చూసేవారు. రియల్ టైమ్ గవర్నెన్స్ అంటూ, వార్ రూమ్ అంటూ హడావిడి చేసేవారు. కానీ జగన్ అలా కాదు. అరగంటలో మీటింగ్ ముగించారు. బాధితుల్ని వెంటనే పునరావాస శిబిరాలకు తరలించాలన్నారు, వచ్చినవారికి ఖర్చుల కింద తక్షణం వెయ్యి రూపాయలు అందించాలని ఆదేశించారు.

పునరావాస శిబిరాల్లో ఉన్న బాధితుల మానసిక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉందో, అసలు ఇల్లు ఉందో లేదో కూడా తెలియని గందరగోళంలో ఉంటారు. శిబిరాల్లో నుంచి ఇళ్లకు పంపించిన తర్వాత కనీసం తినడానికి తిండి గింజలు కూడా దొరకవు. అప్పులిచ్చేవారుండరు, వండుకోడానికి పాత్రలు కూడా కొన్నిసార్లు కరువే. అలాంటి వారికి ఈ వెయ్యి రూపాయల ఆర్థిక సాయం మానసిక సాంత్వన చేకూరుస్తుంది. 

కడుపునిండా భోజనం పెట్టడంతోపాటు, ఆర్థిక సాయం కూడా చేస్తే ఆ బాధిత ప్రాణం కాస్త కుదుటపడుతుంది. బయటకెళ్లిన తర్వాత పస్తులుండాల్సిన అగత్యం తప్పుతుంది. పనిలో కుదురుకునే వరకు తిండి ఖర్చులు జరిగిపోతాయి. అందుకే జగన్ ఆర్థిక సాయం విషయంలో అర నిమిషం కూడా ఆలస్యం చేయరని ఆయన మనసు తెలిసినవారు చెబుతుంటారు.

విశాఖ గ్యాస్ లీకేజీ బాధితుల విషయంలో ఆస్పత్రికి వెళ్లి మరీ కోటి రూపాయల ఆర్థిక సాయం బాధితుల కుటుంబాలకు అందించిన ఘనత జగన్ ప్రభుత్వానిది. విజయవాడలో ఓ బాధితురాలిని కూడా 24 గంటల వ్యవధిలో ఆదుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తక్షణ సాయం విషయంలో జగన్ చూపించిన చొరవ అంతాఇంతా కాదు. 

తుఫాన్ వచ్చినా, ఇంకే కష్టమొచ్చినా.. బాధితుల కళ్ల నీళ్లు ఇంకక ముందే సాయం ప్రకటించడం, ప్రకటించిన సాయాన్ని అంతే వేగంగా వారి చేతికి అందించడం జగన్ హయాంలోనే చూస్తున్నాం. ప్రస్తుతం వర్షాల బాధితులకు జగన్ ఇచ్చిన ఆర్థిక భరోసా కూడా ఇలాంటిదే.