జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాల కార్యక్రమాలు వేటికవే ప్రత్యేకం. ఇక జగన్ నవరత్నాల్లో ఆయనకు అన్నిటికంటే మిన్నగా పేరుతెస్తోంది మాత్రం “నాడు-నేడు” అని చెప్పక తప్పదు. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు కార్యక్రమానికి ఏ మహూర్తాన శ్రీకారం చుట్టారో కానీ.. నేడు గ్రామాలన్నీ పార్టీలకతీతంగా జగన్ ని కీర్తిస్తున్నాయి. స్వాతంత్రం వచ్చాక పాఠశాలల గురించి మనస్ఫూర్తిగా పట్టించుకున్న నాయకుడు జగన్ ఒక్కడేనని అంటున్నారు పల్లెవాసులు.
నాడు-నేడు పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలు చూసి ఇతర ప్రాంతాల్లో ఉన్నవారంతా సొంతూరిలో ఉన్నవారికి ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు స్కూళ్లకు మహర్దశ పట్టిందని సంతోషపడుతున్నారు. వేసవి సెలవలకు కరోనా సెలవలు కూడా కలసి రావడతో జగన్ అనుకున్నట్టు పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల స్కూల్స్ తిరిగి ప్రారంభిస్తే.. లక్షలాది మంది చిన్నారుల మోముల్లో సంతోషం వెల్లి విరుస్తుంది.
12వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన భారీ ప్రాజెక్ట్ నాడు-నేడు. తొలిదశ అమలుతోనే ఫలితం బ్రహ్మాండంగా కనిపిస్తోంది. కార్పొరేట్ ని తలదన్నే రీతిలో స్కూల్స్ కొత్త రూపు సంతరించుకున్నాయి. తొలి దశలో 15715 స్కూల్స్ రూపురేఖల్ని పూర్తిగా మార్చేశారు, రెండో దశలో 14584, మూడో దశలో 16489.. ఇలా 2022కల్లా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో మౌలిక వసతులతో పాటు.. అదనపు హంగులు చేర్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.
కేవలం నిధులిచ్చి వదిలేయకుండా పాఠశాల కమిటీలు, స్థానిక నాయకులు ఈ పథకం అమలు తీరు నిర్మాణాలను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు సీఎం జగన్. తొలిదశ విజయవంతం కావడంతో.. అటు ఉపాధ్యాయులు, ఇటు గ్రామస్తులు కూడా సంతోషంగా ఉన్నారు. గతంలో చాలామంది మాటలు చెప్పారు కానీ, తొలిసారిగా చేతల్లో చూపించింది మాత్రం జగన్ ఒక్కరేనంటున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాలకు చెందిన స్కూళ్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పార్టీలకతీతంగా నాడు-నేడు కార్యక్రమం గ్రామాల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఇక మిగిలింది ఇంగ్లిష్ మీడియం అమలు మాత్రమే. ఎలాంటి అడ్డంకులు లేకుండా అది కూడా అమలులోకి వస్తే.. సీఎం జగన్ ఏపీ భవిష్యత్ తరానికి బంగారు బాటలు వేసినవారవుతారు.