మారాలి పవన్.. రావాలి పవన్

టీడీపీతో పొత్తు ఉన్నన్ని రోజులూ.. చంద్రబాబుని పొగడ్డమే పవన్ కల్యాణ్ పని, జగన్ విమర్శలను తిప్పికొట్టడం, బాబు చేస్తున్న పనుల్ని సమర్థించడం కోసమే ఆయన కష్టపడ్డారు. అదే టైమ్ లో సొంత పార్టీని, దాని…

టీడీపీతో పొత్తు ఉన్నన్ని రోజులూ.. చంద్రబాబుని పొగడ్డమే పవన్ కల్యాణ్ పని, జగన్ విమర్శలను తిప్పికొట్టడం, బాబు చేస్తున్న పనుల్ని సమర్థించడం కోసమే ఆయన కష్టపడ్డారు. అదే టైమ్ లో సొంత పార్టీని, దాని నిర్మాణాన్ని గాలికొదిలేశారు. ఫలితం 2019 ఎన్నికల్లో మనం చూశాం. ఇప్పుడు టీడీపీకి దూరమైన జనసేన బీజేపీకి దగ్గరైంది. కానీ పవన్ కల్యాణ్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పురాలేదు. అప్పుడు టీడీపీని పొగిడిన పవన్, ఇప్పుడు బీజేపీని భుజానికెత్తుకున్నారు. లాక్ డౌన్ సమయంలో, నిబంధనలు సడలించాక కూడా.. బీజేపీ భజన చేస్తూ కాలం గడిపేస్తున్నారు.

ఏపీలోని కమలదళం కూడా ఆ స్థాయిలో కేంద్ర నిర్ణయాలకు వత్తాసుల పలకడం కానీ, మోడీకి మొక్కడం కానీ చేయలేదంటే.. పవన్ ఏ స్థాయి భజన చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆయన లాజిక్ ఆయనది. కానీ జనసైనికులు మాత్రం పవన్ పై గుర్రుగా ఉన్నారు. సోషల్ మీడియాలో పరోక్షంగా విమర్శలు మొదలుపెట్టారు.

“మద్దతిచ్చినవారిని నెత్తిన పెట్టుకోవడం వల్లే గతంలో ఓసారి దెబ్బతిన్నాం.. ఈ దఫా అంతకంటే ఎక్కువగా కొత్త మిత్రుల్ని మోయడం అవసరమా”? అంటూ డిస్కషన్ మొదలు పెట్టారు జనసైనికులు. సొంత పార్టీని పట్టించుకోకుండా ఎంతసేపు.. పొత్తు పెట్టుకున్న పార్టీల కోసం పాకులాడితే భవిష్యత్ లో జనసేన పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల టైమ్ ఉంది, అప్పటికి ఈ పొత్తులుంటాయో, ఉండవో తెలియదు. ఇప్పుడు భజన చేస్తున్న పార్టీనే రేపు తిట్టాల్సి రావొచ్చు, ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితి రావొచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇప్పట్నుంచీ బీజేపీకి భజన చేస్తూ కాలం గడిపితే, భవిష్యత్తులో జనసేన బలహీన పడుతుందని వాదిస్తున్నారు. 

వచ్చే ఎన్నికలనాటికి జనసేనకు ఒంటరిగా బరిలో దిగే సత్తా రావాలంటే, పవన్ కల్యాణ్ ఇలా పక్క పార్టీలను పొగడ్డం మానేసి, సొంత పార్టీ నేతల్ని హైలెట్ చేయాలని, సొంత పార్టీకి జవసత్వాలు నింపే ప్రయత్నం చేయాలని అంటున్నారు కార్యకర్తలు. బైటపడి గొడవ చేయడం లేదు కానీ, సోషల్ మీడియాలో పరోక్షంగా చురకలంటించే ప్రయత్నం బాగానే జరుగుతోంది.. రావాలి పవన్.. మారాలి పవన్ అనే మీమ్ ఇలా పుట్టుకొచ్చిందే.

తమ్ముడు అలా.. అన్న ఇలా

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు