జనసేన పార్టీ తరపున వచ్చే ప్రెస్ నోట్లన్నీ మంచి కామెడీగా ఉంటాయి. అప్పటికే అయిపోయిన విషయాలను ప్రస్తావించడం ఇందులో మొదటి పాయింట్ అయితే, తమ చేతిలో లేని విషయాలపై కూడా ఓవర్ గా స్పందించడం రెండో పాయింట్. పవన్ సినిమాల్లోకి వెళ్లిన తర్వాత ఇటీవల ఇలాంటి ప్రెస్ నోట్ల సంఖ్య తగ్గింది. తాజాగా పవన్ ప్లేస్ లో మరికొందరి అభిప్రాయాలు ఇప్పుడు బయటకొస్తున్నాయి. ఇవి అంతకంటే ఫన్నీగా ఉంటున్నాయి.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కుదించడం సరికాదందూ జనసేన నేతలు సుప్రీంకోర్టుకి వెళ్తారట. ఈ మేరకు పార్టీ ఇద్దరు బీసీ నేతల పేర్లతో ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. బీసీలపై జనసేనకున్న ప్రేమ ఇదీ అంటూ ఢంకా భజాయించారు ఇందులో. అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లి ఏం చెబుతారు.
టీడీపీ నిర్వాకం వల్ల రాజ్యాంగ విరుద్ధమంటూ ఏపీలో బీసీల రిజర్వేషన్లు పెంచే జీవోని హైకోర్టు తిరస్కరించింది. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ, కేంద్రం నిధులు వెనక్కిపోతాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నెలాఖరులోగా ఎన్నికలకు కసరత్తులు ప్రారంభించింది. అంటే.. 50శాతం రిజర్వేష్లకే జగన్ సర్కారు అనివార్యంగా ఒప్పుకున్నట్టు లెక్క.
ఈ దశలో జనసేన నేతలు సుప్రీంకోర్టుకి ఏమని వెళ్తారు, ఏ విధంగా పిటిషన్ వేస్తారు. రిజర్వేషన్లు 50 శాతం లోపే ఉన్నాయి, వాటిని పెంచాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు అడ్డుకుంది, ప్రభుత్వం వెనక్కు తగ్గడంతో అక్కడితో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. ఇక దీనిపై సుప్రీంలో పిటిషన్ వేయాలంటే అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయాల్సిన పని.
రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే.. టీడీపీ కానీ, జనసేన కానీ అందులో ఇంప్లీడ్ కావొచ్చు, తమ వాదనలు కూడా వినిపించొచ్చు టైమ్ సరిపోక ప్రభుత్వమే ఎన్నికలకు వెళ్తామంటుంటే.. ఇక జనసేన చేసేదేముంటుంది. అసలీ విషయం జనసేన నాయకులకు తెలుసా? తెలియదా? పవన్ ఉన్నప్పుడు తెలిసీ తెలియక ఇలాంటి కామెడీలు చేస్తుంటారు, పవన్ లేనప్పుడు కూడా ఈ కామెడీలు కొనసాగుతున్నాయి.