బుచ్చయ్య రాజీనామా.. జూనియర్ ఎన్టీఆరే కారణమా?

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అలకకు కారణం ఏంటి..? ఏకంగా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ ఆయన ఎందుకు ఊగిపోయారు.  Advertisement అంత…

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అలకకు కారణం ఏంటి..? ఏకంగా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ ఆయన ఎందుకు ఊగిపోయారు. 

అంత పెద్ద నాయకుడిని పార్టీ ఎందుకు అవమానించింది..? బుచ్చయ్యను పార్టీ అవమానించడానికి పెద్దగా కారణాలేవీ లేవు. అసలు కారణం ఒక్కటే. అతడే వన్ అండ్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్. అవును జూనియర్ పేరెత్తారు కాబట్టే ఆయనను చినబాబు టార్గెట్ చేశారు. కక్షగట్టారు, పొమ్మనలేక పొగబెట్టారు.

ఈ ఏడాది టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలే ఆయనకు ఇబ్బందిగా మారాయని స్పష్టమవుతోంది. రాజమండ్రి పార్టీ ఆఫీస్ లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు బుచ్చయ్య. 40 ఏళ్లుగా పార్టీ ఎన్నో ఇబ్బందులొచ్చినా ఎదుర్కొని నిలబడిందని, ఇప్పుడు వైసీపీని కూడా అలాగే ఎదుర్కొంటోందని చెప్పారు. 

పార్టీలోకి కొత్త నాయకత్వం వస్తుందని, మరిన్ని మార్పులుంటాయని చెప్పారు. అంతే కాదు, జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని ఆయన తన ఆకాంక్షను వెలిబుచ్చారు. ఒకరకంగా జూనియర్ పార్టీలోకి రావాల్సిందేనని, పార్టీకి కొత్త నాయకుడు కావాల్సిందేనని అన్నారు చౌదరి.

టీడీపీలో ఉండాలనుకున్నవారెవరైనా ముందు చంద్రబాబుకి జై కొట్టాలి, ఆ తర్వాత చినబాబుకి జిందాబాద్ అనాలి. మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రావడంతో లోకేష్ కి బాగా కాలింది. ఆఖరుకి బాలకృష్ణ చేత కూడా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అవసరం లేదని చెప్పించిన ఘనుడు లోకేష్. 

అలాంటి లోకేష్.. బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నేత ఆ పేరు తెరపైకి తెస్తే ఊరుకుంటారా..? అందుకే ఆయన్ను టార్గెట్ చేశారు. రాజమండ్రి పార్టీ వ్యవహారాల్లో ఆయన పాత్ర తగ్గించారు. ఫోన్లు ఎత్తడం మానేశారు, జూమ్ మీటింగ్ లకు చివరి నిముషంలో పిలుస్తారు, ఇలా.. రకరకాలుగా బుచ్చయ్యను అవమానించారు.

కనీసం చంద్రబాబు కూడా బుచ్చయ్య మాటలు వినకపోయే సరికి ఆయనకు కూడా చిరాకొచ్చింది. చంద్రబాబుకంటే బుచ్చయ్యే పార్టీలో సీనియర్. ఎన్టీఆర్ హయాం నుంచి ఆయన పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. పైగా వైసీపీ హవాలో లోకేష్  లాంటి వాళ్లు కొట్టుకుపోయినా, బుచ్చయ్య లాంటి వారు గట్టిగా నిలబడ్డారు. అయినా కూడా పార్టీ అవమానిస్తుండే సరికి తట్టుకోలేకపోయారు. రాజీనామాస్త్రాన్ని ప్రయోగించారు.

బుచ్చయ్యలాంటి సీనియర్ అలిగితే నేరుగా వచ్చి పలకరించాలి కానీ, చంద్రబాబు ఫోన్లో ఏదేదో సర్దిచెప్పారనడం హాస్యాస్పదం. కనీసం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా పలకరించలేదట. రాజమండ్రి సిటీలో తన అన్న కుమార్తె ఎమ్మెల్యేగా ఉండటం, రూరల్ లో బుచ్చయ్య వర్గానికి ఆమెకు పడకపోవడంతో.. అచ్చెన్న కూడా బుచ్చయ్యని సాగనంపాలనే చూస్తున్నారని సమాచారం. ఇవన్నీ ఈ ఎపిసోడ్ లో వరుసగా జరిగిన పరిణామాలు. అయితే దీనికి మూల కారణం మాత్రం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఎన్టీఆర్ ఎంట్రీపై బుచ్చయ్య చేసిన వ్యాఖ్యలేనని స్పష్టమైంది.

పరోక్షంగా ''ఎన్టీఆర్ ఫోబియా'' బయటపడిందిలా?

జూనియర్ పేరెత్తితే ఎలా ఉంటుందో పార్టీ కేడర్ కి తెలియజెప్పడానికే లోకేష్ ఇలా వ్యవహరించారనేది బహిరంగ రహస్యం. మొత్తమ్మీద బుచ్చయ్య పార్టీలోకి రావడానికి సీనియర్ ఎన్టీఆర్ కారణం అయితే, పార్టీ నుంచి బయటకెళ్లిపోవడానికి జూనియర్ ఎన్టీఆర్ పరోక్ష కారణంగా మిగిలిపోయారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ తో ఒకటి మాత్రం స్పష్టమైంది. 

అటు చంద్రబాబుకు, ఇటు లోకేష్ కు ఎన్టీఆర్ ఫోబియా పట్టుకుందనే విషయం స్పష్టమైంది. ఎక్కడ ఎన్టీఆర్ బరిలో దిగితే తమ సీటుకు ఎసరు పెడతాడో అనే భయం బుచ్చయ్య ఎపిసోడ్ తో బహిర్గతమైంది.