ఆ డ్రైవర్ చనిపోయాడు

హైదరాబాద్ కాచిగూడ వద్ద రెండు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్ ట్రైన్ లోకో పైలెట్ చంద్రశేఖర్ మృతిచెందాడు. ఈనెల 11న ప్రమాదం జరగగా, అప్పట్నుంచి కేర్ ఆస్పత్రిలో అతడు చికిత్స…

హైదరాబాద్ కాచిగూడ వద్ద రెండు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్ ట్రైన్ లోకో పైలెట్ చంద్రశేఖర్ మృతిచెందాడు. ఈనెల 11న ప్రమాదం జరగగా, అప్పట్నుంచి కేర్ ఆస్పత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. 2 రోజుల కిందట అతడి కాలును వైద్యులు తొలిగించారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించడంతో చంద్రశేఖర్ మృతిచెందాడు.

కాచిగూడ యాక్సిడెంట్ లో చంద్రశేఖర్ దే తప్పంటోంది రైల్వే శాఖ. స్టేషన్ లో సిగ్నల్ ను గమనించకుండా వెళ్లాడని, ఫలితంగా హంద్రీ ఎక్స్ ప్రెస్, ఎంఎంటీఎస్ పరస్పరం ఢీకొట్టాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు లోకో పైలెట్ పై పలు కేసులు కూడా నమోదుచేశారు. తన కొడుకును కావాలనే బలిపశువును చేశారని చంద్రశేఖర్ తండ్రి ఆరోపిస్తున్నారు. ఇంతలోనే చంద్రశేఖర్ మృతిచెందాడు.

అప్పటి ఘటనలో రెండు రైళ్లకు చెందిన ఇంజిన్లు నుజ్జునుజ్జయ్యాయి. ఎంఎంటీఎస్ రైలుకు చెందిన 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 30మందికి గాయాలయ్యాయి. రైళ్లు పరస్పరం ఢీకొన్న దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యాయి కూడా.
 
ఘటనలో లోకో పైలెట్ చంద్రశేఖర్ ఇంజిన్ క్యాబిన్ భాగంలో ఇరుక్కుపోవడంతో, 8 గంటల పాటు శ్రమించి అతడ్ని బయటకు తీశారు. అలా బయటకొచ్చిన అతడు, రాత్రి మృతిచెందాడు. చంద్రశేఖర్ మృతితో ఈ కేసు క్లోజ్ కాబోతోంది.