మళ్లీ రంగంలోకి కేసీఆర్‌ కూతురు…!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూతురు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఆమె మళ్లీ రంగంలోకి దిగడానికి రంగం సిద్ధమవుతోంది. ఆమె మళ్లీ రంగంలోకి దిగడమేంటి? ఆమె రాజకీయాల నుంచి వెళ్లిపోలేదు కదా. నిజమే కాని…

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూతురు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఆమె మళ్లీ రంగంలోకి దిగడానికి రంగం సిద్ధమవుతోంది. ఆమె మళ్లీ రంగంలోకి దిగడమేంటి? ఆమె రాజకీయాల నుంచి వెళ్లిపోలేదు కదా. నిజమే కాని గత లోక్‌సభ ఎన్నికల్లో   బీజేపీ చేతిలో ఓడిపోయాక కల్వకుంట్ల కవిత చురుకుదనం గ్రాఫ్‌ పూర్తిగా తగ్గిపోయింది. యాక్టివ్‌నెస్‌ లెవెల్స్‌ పడిపోయాయి. దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగా వ్యవహరిస్తోంది. పబ్లిక్‌లో కనబడటమే అరుదైపోయింది. ఆమె ఎన్నికల్లో ఓడిపోయాక బోనాలు, బతుకమ్మ పండుగల్లో తప్ప మరెప్పుడూ పబ్లిక్‌లో కనబడలేదు. ఒకప్పటి మాదిరిగా సమకాలీన సమస్యలపై మాట్లాడటంలేదు. రాజకీయ చాణక్యుడు కేసీఆర్‌ కూతురు ఇలా ఉండటమేమిటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. 

తండ్రి కేసీఆర్‌, అన్న కేటీఆర్‌ ఎంతటి మాటకారులో కవిత కూడా అంతే. ఇలాంటి చురుకైన మహిళ  డల్‌గా ఉండకూడదు కదా. అందుకే మళ్లీ యాక్టివ్‌ రోల్‌ పోషించడానికి సిద్ధమవుతోంది. నిజామాబాద్‌ ఓటమి తరువాత రాజకీయాల్లో ఆమె పాత్ర గురించి రకరకాల వార్తలొచ్చాయి. ఆమెను  ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేస్తారని కథనాలొచ్చాయి. రాజ్యసభకు పంపుతారని కొందరన్నారు. కానీ ఏమీ కాలేదు. ఆమె ఎంపీగా పోటీ చేయాలంటే ఇంకా నాలుగేళ్లు ఆగాలి. ఒకప్పుడు ఎంపీగా ఎంతో చురుగ్గా వ్యవహరించిన కవిత అన్నేళ్లు మౌనంగా ఉండగలదా? అలా ఉంటే నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ముప్పు రావొచ్చు. అందుకే త్వరలో రాజకీయంగా వస్తున్న అవకాశాన్ని ఆమె వినియోగించుకునే పనిలో ఉంది. ఆ అవకాశమే మున్సిపల్‌ ఎన్నికలు. 

ఆ ఎన్నికల్లో నిజామాబాద్‌ కార్పొరేషన్‌ సహా నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న మున్సిపాలిటిలన్నిటినీ టీఆర్‌ఎస్‌పరం చేసేందుకు పావులు కదపడానికి, బీజేపీ దూకుడుకు కళ్లెం వేయడానికి ఆమె రంగంలోకి దిగబోతోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో కవిత కీలకపాత్ర పోషించడానికి పార్టీలో కసరత్తు జరుగుతోంది. గత ఎన్నికల్లో కవిత ఓటమికి ప్రధాన కారణం జిల్లాలోని పసుపు రైతులు. వారి అసంతృప్తి, అసహనం కారణంగానే కవితకు ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. వారి అసంతృప్తికి కారణం కవిత తన పదవీ కాలంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయించలేకపోవడం. 

మరి ఆమెను ఓడించిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ నెల రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని  రైతులకు హామీ ఇచ్చాడు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి పసుపు బోర్డు సులభంగా ఏర్పాటవుతుందని అనుకున్నాడు. కాని ఆ విషయంలో విఫలమయ్యాడు. దీంతో అర్వింద్‌ పట్ల కూడా పసుపు రైతులు అసంతృప్తిగా ఉన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వారిని దార్లోకి తెచ్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని టీఆర్‌ఎస్‌ నాయకులు భావిస్తున్నారు. అనేకమంది రైతులు టీఆర్‌ఎస్‌ నాయకులను కలుసుకొని పసుపు బోర్డు గురించి గోడు వెళ్లబోసుకుంటున్నారట. నిజామాబాద్‌ బీజేపీలో ఉన్న అంతర్గత రాజకీయాలు కూడా టీఆర్‌ఎస్‌కు ఉపయోగపడతాయని అనుకుంటున్నారు. కవిత యాక్టివ్‌ కావడానికి ఇది మంచి సమయమని టీఆర్‌ఎస్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు. 

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు, ఆరు మున్సిపాలిటీలున్నాయి. వీటిని కైవసం చేసుకోవాలంటే కవిత రంగంలోకి దిగాల్సిందే. రాష్ట్రంలోని ఎన్నికలు జరిగే స్థానిక సంస్థలన్నీ టీఆర్‌ఎస్‌ కైవసం కావల్సిందేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. సో…కవిత అవసరం ఇప్పుడు చాలా ఉంది. కవిత చురుగ్గా లేకపోవడం వల్ల నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ కేడర్‌ డీలా పడిందని నాయకులు దిగులు పడుతున్నారు. అక్కడ బలమైన నేత లేకపోతే ఎలాంటి పరిణామాలైన సంభవించవచ్చని అంటున్నారు. ధర్మపురి శ్రీనివాస్‌ పేరుకు టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడైనా ఆయనకు పార్టీతో సంబంధాలు లేవు. 

కవితకు, ఆయనకు అస్సలు పడదు. డీఎస్‌పైన కవిత ఆరోపణలు చేసినప్పనప్పటినుంచే కదా కేసీఆర్‌కు, ఆయనకు మధ్య చిచ్చు రేగింది. జిల్లాలో టీఆర్‌ఎస్‌ను కకావికలు చేయడానికి డీఎస్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అందులోనూ ఎంపీ కూడా ఆయన కొడుకే కదా. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను పట్టుకోవడానికి బీజేపీ పెద్ద కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీలు ఎలా ఉన్నా కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌కైనా, బీజేపీకైనా చాలా కీలకం. దీనికోసం హోరాహోరీగా పోరు సాగడం ఖాయం. ఒక్క మున్సిపల్‌ ఎన్నికల్లో కోణంలోనే కాకుండా ఏవిధంగా చూసినా కవిత అవసరం చాలా ఉంది. వచ్చే ఎన్నికల వరకూ కవిత ఇలాగే ఏమీ పట్టనట్లుగా ఉంటే పార్టీకి నష్టం కలుగుతుందని నాయకులు అంటున్నారు.