ఇన్నాళ్లూ బాలీవుడ్ గురించినే ఆమె మాట్లాడేది. అయితే ఆమె నోటికి అడ్డూ అదుపు లేకుండా తయారైపోయింది. ఈ నేపథ్యంలో.. దేశానికి స్వతంత్రం 2014లోనే వచ్చిందని అంటోంది! అయినా.. ఆమెకు అడ్డే ముంది? భారతీయ జనతా పార్టీకి అప్రకటిత సానుభూతి పరురాలు. అందుకే 2014లోనే దేశానికి స్వతంత్రం వచ్చిందని అంటోంది. ఆమే కాదు.. చాలా మంది భక్తులు అదే మాటే అంటారు.
అనకపోతే కంగనాను ఇప్పుడు సమర్థిస్తూ..2014లోనే దేశానికి స్వతంత్రం వచ్చిందంటూ పుస్తకాల్లో మార్చగలరు. పుస్తకాల్లో కాకపోయినా.. వాట్సాప్ యూనివర్సిటీ మెసేజ్ డంప్ లలో ఈ మేరకు మార్చుకుని ప్రచారం చేయగలరు. అతి త్వరలోనే.. దేశానికి స్వతంత్రం వచ్చింది 2014లోనే అంటూ నమ్మించగల ఘటనాఘట సమర్థులు అక్కడున్నారు. వారికి కంగనా కొత్త స్ఫూర్తిని ఇచ్చింది. ఇక నుంచి వాట్సాప్ యూనివర్సిటీ ఆ పనిలో ఉంటుంది.
ఇక కంగనాపై ఇప్పటి వరకూ పది చోట్ల ఫిర్యాదులు అందాయని సమాచారం. ఒక సదస్సులో దేశానికి 1947లో లభించింది ముష్టి మాత్రమే, 2014లో మాత్రమే దేశానికి స్వతంత్రం వచ్చిందంటూ ఈమె సూక్తీకరించిన నేపథ్యంలో.. ఆమెపై వరస ఫిర్యాదులు చేస్తున్నారు కొంతమంది.
అయితే అలాంటి వారిని కంగనా దేశద్రోహులు అనగలదు. వారిని తను లెక్క చేసేది లేదని కూడా ఆమె తేల్చి చెప్పగలదు. 2014లోనే స్వతంత్రం వచ్చింది… ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆమె నొక్కి వక్కాణించనూ గలదు! అందుకు అవసరమైన సాధనా సంపత్తి అంతా ఆమెకు ఉంది! భక్తురాలు కావడమే ఆమె నోటికి ఎలాంటి హద్దులూ లేకుండా చేసిన అంశం.
ఇక ఇప్పటికే కంగనా ఒక కేసులో కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంది. ఒక బాలీవుడ్ సినిమా వ్యక్తి గురించినే అనుచితంగా మాట్లాడి.. పరువు నష్టం కేసులో కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఆ కేసును ఆ కోర్టులో విచారించడానికి వీల్లేదని, మరో కోర్టుకు మార్చాలని కూడా కోరి భంగపడింది. అయితే కంగనాకు ఇంకా వేడి తగలనట్టుగా ఉంది. ఇప్పుడు మరో కామెంట్ తో ఆజ్యం పోసింది. ఈ ఫిర్యాదులు, కేసులు ఎలా ఉన్నా.. ఆమెకు కావాల్సిన పబ్లిసిటీ అయితే ఆమెకు పుష్కలంగా లభిస్తోంది.
భక్తగణంలో కొత్త డిగ్రీ ఆమె సొంతం అయినట్టే. ఎటొచ్చీ దీని కోసం దేశం, స్వతంత్రం వంటి అంశాలను కూడా చాలా తేలికగా వాడుకోవచ్చని కంగనా నిరూపించింది. అధికారంలో ఉన్న వారిని ప్రసన్నం చేసుకోవడానికి.. దేన్నైనా తేలిక చేయొచ్చని చాటింది. ఆమె పై ఎలాంటి చర్యలు లేకపోతే.. మేరా భారత్ మహాన్!