కాపుల రిజర్వేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన సమాచారంతో, దాన్ని అడ్డుపెట్టుకుని ఏపీలో రాజకీయ రచ్చకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని 2014లో టీడీపీ ఎన్నికల హామీ ఇచ్చి, వారి ఓట్లను కొల్లగొట్టింది. అయితే ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. పైగా హామీని అమలు చేయాలని ఉద్యమించిన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులపై చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. వందలాది మంది కాపులపై కేసులు పెట్టింది. ఆ కేసులను ఇటీవల జగన్ ప్రభుత్వం ఎత్తేసింది.
ఈ నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు మోదీ సర్కార్10 శాతం రిజర్వేషన్ కల్పించిన సంగతి తెలిసిందే. ఈ రిజర్వేషన్లో కేవలం కాపులకే ఐదు శాతం కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తన పాలన చివరి రోజుల్లో నిర్ణయం తీసుకుంది. దీన్ని జగన్ ప్రభుత్వం ఎత్తేసింది. ఎందుకనో టీడీపీ ఆ విషయమై మౌనం పాటించింది. కానీ బీజేపీ మాత్రం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపు రిజర్వేషన్లపై అడిగిన ప్రశ్నకు కేంద్రం కీలక సమాధానం ఇచ్చింది. కాపు ఓబీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉందని కేంద్రం తేల్చి చెప్పింది. కాపులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ఏపీ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ఓబీసీ రిజర్వేషన్ల అంశం స్టేట్లిస్ట్లో ఉన్నందున.. ఈ వ్యవహారంలో తమ పాత్ర లేదని కేంద్రం తెలిపింది.
రాష్ట్ర ఓబీసీ జాబితాలో ఒక కులాన్ని చేర్చడానికి.. రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. దీన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఏ విధంగా ఉపయోగించుకుంటాయో వాటి వ్యూహాలపై ఆధారపడి వుంటుంది. కానీ కాపుల రిజర్వేషన్ అంశం మాత్రం తప్పకుండా మరోసారి రాజకీయంగా చర్చకు దారి తీస్తుంది. జగన్ ప్రభుత్వంపై కాపులను రెచ్చగొట్టేందుకు రిజర్వేషన్లను ఆయుధంగా తీసుకుంటారనడంలో అతిశయోక్తి లేదు.