కార్మిక నాయకుడు సింగారానికి జై

1990ల్లో ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన “వినోదం”లో ఒక ఘట్టముంటుంది. నలుగురు యువకులు ధవంతుడైన బంగారం అనే వ్యక్తికి రాత్రికి రాత్రి మత్తిచ్చి, గెటప్ మార్చేసి ఒక పాకలో పడుకోబెడతారు.  Advertisement బంగారం నిద్ర లేవగానే…

1990ల్లో ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన “వినోదం”లో ఒక ఘట్టముంటుంది. నలుగురు యువకులు ధవంతుడైన బంగారం అనే వ్యక్తికి రాత్రికి రాత్రి మత్తిచ్చి, గెటప్ మార్చేసి ఒక పాకలో పడుకోబెడతారు. 

బంగారం నిద్ర లేవగానే ఈ యువకులే “కార్మిక నాయకుడు సింగారానికి జై” అంటూ నినాదాలు చేస్తారు.

తాను అక్కడెందుకున్నానో ఆలోచించుకోవడానికి కూడా గ్యాపివ్వకుండా ఆ నినాదంతో ఊదరగొట్టేసి తనని తాను నిజంగానే సింగారాన్ని అని భ్రమ చెందేలా చేసేస్తారు. ఆ ఊదరగొట్టుడు ఏ రేంజులో ఉంటుందంటే అసలిక బంగారానికి తన గతం గుర్తురాదు. సినిమా సక్సెసు. ఆ సీన్ కూడా ఫ్యామసు. 

అయితే అప్పట్లో కొందరు విజ్ఞులు ఏదో కామెడీ కోసం ఇలాంటి అసహజమైన సన్నివేశం పెట్టారనుకుని కొట్టి పారేసారు. 

కానీ సరిగ్గా ఇన్నేళ్ళకి అది అసహజం కాదు, ఎవర్నైనా ఊదరగొట్టి ఏ భ్రమలోకైనా నెట్టేయొచ్చని నిరూపితమయ్యింది. 

మిగిలిపోయిన స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు చావుదెబ్బ తిన్నారు. కుప్పంలో ప్రచారం నిమిత్తం సరిగ్గా ఎన్నికల ముందు చంద్రబాబు  ఎన్ని కుప్పిగంతులేసినా తెదేపా పరువుని కుప్పగా పోసి ఓటర్లు నిప్పంటించారు. 

అక్కడ మాత్రమే కాకుండా రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్లా తెదేపా భంగపడింది. 

ఒక్క దర్శిలో మాత్రం తెదేపా వైసీపీ కన్నా ఎక్కువ స్థానాలు గెలిచింది. ఒకటి రెండు చోట్ల సమానమైన స్థానాలు కూడా గెలుచుకుంది. అంతే..అదేదో రాష్ట్రం మొత్తంలో తెదేపా గెలుపు మారుమోగుతోందన్న రేంజులో చంద్రబాబు మిత్రమీడియా రకరకాల హెడింగులు పెట్టి చర్చలు నడిపింది. 

“బద్దలైన వైసీపీ కంచుకోటలు”, “హవా చూపిన తెదేపా”, “తెదాపా కి పునరుత్తేజాన్నిచ్చిన స్థానిక ఎన్నికలు”, “సత్తా చాటిన తెదేపా”…ఇవీ శీర్షికలు. 

అసలేమైనా అర్థం ఉందా? ఎవరి కంచుకోట బద్దలైంది? ఇలాంటి నినాదాల్లాంటి హెడింగులుతో ఊదరగొడుతుంటే చంద్రబాబు నాయుడు నిజమనుకుని భ్రమరావతిలో బతుకుతున్నారు. ఈ తతంగాన్ని “వినోదం” సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లాగ యావన్మంది ప్రజానీకం గొల్లున నవ్వుకుంటున్నారు. 

తెదేపాకి ఈ దీనమైన గతి పట్టడానికి అసలు కారణం పచ్చ మాధ్యమాలే. స్వామిభక్తి పేరుతో చేసే అతి వల్ల అతలాకుతలం అయిపోయింది ఆ పార్టీ. గతంలో ఏం చేసినా సాగేది. ఇప్పుడు మాధ్యమాలు పెరిగిపోయి, సామాజిక మాధ్యమాల వలన ప్రతి వ్యక్తీ ఒక మాధ్యమం అయిపోయిన తరుణంలో పద్ధతులు మార్చుకోవాలి. 

ఇప్పటికీ చంద్రబాబు, లోకేష్ మాటలు చూస్తుంటే పాపం అనిపిస్తోంది. వాళ్లకి అలా పొగడ్త అనే మత్తు ఎక్కించి పిచ్చి సింగారాల్లాగ మార్చేసాయి పచ్చ మీడియాలు. 

తండ్రీకొడుకుల అంచనా ఏంటంటే ఇలాంటి రాతలు, కూతలు మీడియాలో మోగుతుంటే ఎప్పటికైనా జనం నమ్మి తమవైపుకి మొగ్గుతారని. అది జరగని పని. మరింత దూరం జరుగుతారు తప్ప ఈ రాతలకి వాళ్లేమీ చలించరు. 

జబ్బు నోట్లో ఉంటే అరికాలికి మందు రాసినట్టు…ఓట్లు జనం దగ్గర ఉంటే మీడియాని మ్యానేజ్ చేసుకుని తృప్తి చెందుతున్నారంటే తండ్రీకొడుకులు ఎలాంటి పిచ్చిమారాజులో అర్థమవుతుంది. 

అవతల జగన్ రెడ్డి జనంతో మమేకమయ్యి ఓట్లు గెలుస్తూ రాష్ట్రాన్నేలుతున్నాడు. చంద్రబాబు మాత్రం మీడియా వాళ్ల ఊదరగొట్టుడుకి బానిసైపోయి ఒక మాలోకంలాగ తనదైన ఊహాలోకంలో జీవిస్తున్నారు. 

సొంత మీడియాలో నాలుగు పొగడ్తలు రాయించుకోవడం తప్పు కాదు. వద్దన్నా రాస్తారు అందులో పనిచేసేవాళ్లు. కానీ నడుం విరిగి చతికిలపడినా కూడా ఒలింపిక్ విజేతకి పెట్టే హెడింగులతో ఊదరగొడితేనే నవ్వొచ్చేది. 

గెలిచినవాడి గురించి ఏది రాసినా జనం గేలి చేయరు. చావుదెబ్బ తిని చెంగేసుకున్నవాడి గురించి బాకాలు ఊదినప్పుడే చిరాకు పడతారు. ఈ లెక్కన పచ్చ మీడియాలు అస్సలు టైమింగ్ తెలియని బాపతనుకోవాలి. 

తెదేపా కళ్లు తెరిచి తమకి పచ్చమీడియా చేస్తున్న ద్రోహాన్ని గ్రహించి అడ్డుకట్ట వెయ్యకపోతే రాను రాను ఇంకా అభాసుపాలు కావడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. మత్తులో ఉన్న తండ్రీకొడుకులకి ఎంత చెప్పినా ఈ విషయం ఎక్కకపోవచ్చు. కనీసం తెలుగు తమ్ముళ్లైనా, కొమ్ముకాసే కులపెద్దలైనా ఈ విషయంలో కలగజేసుకుంటే మంచిది. 

హరగోపాల్ సూరపనేని