ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో వంటల పోటీ కార్యక్రమానికి తమన్న వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ షో హిట్టయితే ఎలాంటి సమస్య ఉండేది కాదు, అది అట్టర్ ఫ్లాప్ అవ్వడంతోనే అసలు చిక్కంతా వచ్చింది. ఆ కార్యక్రమం సీజన్-1 పూర్తయిన వెంటనే తమన్నాను తప్పించారు. అదే టైమ్ లో ఆమెకు కొంత పారితోషికాన్ని కూడా ఎగ్గొట్టినట్టు వార్తలొచ్చాయి.
ఆ కార్యక్రమాన్ని ప్రొడ్యూస్ చేసిన ఐఎఫ్ఏ సంస్థ దీనిపై అప్పట్లో వివరణ ఇచ్చింది. తమన్నపై ఓ రేంజ్ లో ఆరోపణలు చేసింది. తమన్న హోస్ట్ చేయడం వల్లనే ఆ షో ఫ్లాప్ అయిందనే విధంగా మాట్లాడిన సంస్థ వ్యక్తులు, ఆమె వల్ల తమకు దాదాపు 5 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది.
ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై తమన్న న్యాయపోరాటానికి సిద్ధమైంది. సదరు సంస్థకు ఆమె తన లాయర్ల సహాయంతో లీగల్ నోటీసు పంపించింది.
ఇంతకీ ఏం జరిగింది?
మాస్టర్ చెఫ్ సీజన్-1కు సంబంధించి ఐఎఫ్ఏ (ఇన్నొవేటివ్ ఫిలిం అకాడమీ) సంస్థ, తమన్నతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మొత్తం 18 రోజుల్లో సీజన్-1 కంప్లీట్ చేయాలనేది ఒప్పందం. జూన్ 24 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే తమన్న మాత్రం 16 రోజులు మాత్రమే పనిచేసిందని, కాబట్టి తాము 16 రోజుల పేమెంట్ మాత్రమే ఇచ్చామని సంస్థ ప్రకటించింది. పైగా 2 రోజులు ఆమె షూట్ కు రాకపోవడం వల్ల తమకు చాలా నష్టం వచ్చిందని సంస్థ ఆరోపించింది.
దీనికి తమన్న తరఫు లాయర్లు కౌంటర్ ఇచ్చారు. 18 రోజులకు గాను, తమన్న ఏకంగా 20 రోజులు వర్క్ చేసిందని.. అలాంటప్పుడు పని దినాల్ని ఎలా తక్కువ చేసి చూపిస్తారంటూ తమన్న లాయర్లు వాదిస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్లు తమన్నతో సదరు సంస్థ జరిగిన ఈ-మెయిల్ సంభాషణలన్నింటినీ తీసి చూపించారు.
ఈ పేమెంట్ విషయం పక్కనపెడితే.. తమన్న గౌరవాన్ని భంగపరిచేలా, ఆమె మార్కెట్ ను దెబ్బతీసేలా ఐఎఫ్ఏ సంస్థ వ్యవహరించిందని లాయర్లు తమ కౌంటర్ లో ఆరోపించారు. తమన్నకు దేశవ్యాప్తంగా చాలా పేరు ఉందని.. సౌత్ సినిమా, బాలీవుడ్ లో ఆమెకు మంచి గుర్తింపు ఉందని.. ఆమె ఇమేజ్ ను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని, దీనికి సదరు సంస్థ సమాధానం చెప్పాలని అంటున్నారు లాయర్లు.
మొత్తమ్మీద ఈ విషయాన్ని తమన్న తేలిగ్గా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకుంది. 2 రోజుల కాల్షీట్ అనే అంశం ఇక్కడ సమస్య కాదని, తన ఇమేజ్ ను దెబ్బతీసేలా వ్యవహరించడమే పెద్ద ఇష్యూ అని ఆమె భావిస్తోంది. ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని తమన్న స్థానంలో అనసూయను పెట్టి కొనసాగిస్తున్నారు.