మోడీ స‌ర్కార్ చేసిన అప్పు రూ.80 ల‌క్ష‌ల కోట్లు!

కేంద్రంలో మోడీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కేంద్ర ప్ర‌భుత్వం చేసిన అప్పు ఎన‌భై ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అని అంటున్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్. మోడీ ప్రధాని పీఠం ఎక్కే నాటికి కేంద్ర…

కేంద్రంలో మోడీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కేంద్ర ప్ర‌భుత్వం చేసిన అప్పు ఎన‌భై ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అని అంటున్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్. మోడీ ప్రధాని పీఠం ఎక్కే నాటికి కేంద్ర ప్ర‌భుత్వం ఖాతాలోని అప్పు యాభై ల‌క్ష‌ల కోట్లు కాగా, ప్ర‌స్తుతం అది కోటీ ముప్పై ల‌క్ష‌ల‌ కోట్ల కు చేరింద‌ని కేసీఆర్ గ‌ణాంకాల‌ను ప్ర‌స్తావించారు. దేశాన్ని మోడీ ఉద్ధ‌రించింది ఏమీ లేద‌ని.. కేంద్రం నుంచి బీజేపీని గ‌ద్దె దించాల‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఈ వ్య‌వ‌హారంలో మోడీ ప్ర‌భుత్వం చేసిన అప్పుల గురించి కేసీఆర్ ప్ర‌స్తావించ‌డం సంగ‌తెలా ఉన్నా.. ఒక‌వైపు ప‌న్నుల బాదుడు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఎక్క‌డా వెనుకడుగు వేయ‌డం లేదు! పెట్రోల్ తో మొద‌లుపెడితే.. ప‌న్నుల బాదుడు విష‌యంలో ఆల్ టైమ్ హై రేంజే త‌ప్ప ఎక్కడా త‌గ్గ‌డం లేదు. పెట్రో ప‌న్నులో రాష్ట్రాల‌కు ఎక్క‌వ వాటా ఇవ్వాల్సి వ‌స్తుందో అని స‌ర్ చార్జీల రూపంలో డ్యూటీని వ‌సూలు చేసుకుంటున్నారు.

ఇక టోల్ గేట్ల గురించి ఆ మ‌ధ్య కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కారీ మాట్లాడుతూ.. టోల్స్ శాశ్వ‌తం అని తేల్చి ప‌డేశారు. దేశలో జాతీయ ర‌హ‌దారుల‌పై ప్ర‌తి 90 కిలోమీట‌ర్ల‌కూ ఒక చోట వ‌సూళ్ల ప‌ర్వం సాగుతూ ఉంటుంది. కారులో ప్ర‌యాణించాలంటే ప్ర‌తి కిలోమీట‌ర్ కూ రూపాయి పైనే సుంకం చెల్లించాల్సిందే. వాహ‌నం సైజు పెరిగే కొద్దీ ఈ సుంకం పెరుగుతూ ఉంది. అదేమంటే.. ఈ సుంకంతో మ‌రో చోట రోడ్లు వేస్తున్నామంటూ కేంద్రం చెబుతోంది!

రోడ్లు వేయాలంటే టోల్స్ వ‌సూలు చేయాల్సిందే అని స్ప‌ష్టం చేస్తున్నారు. మ‌రి పెట్రో ల్ పై లీట‌ర్ కు ముప్పై న‌ల‌భై రూపాయ‌లు కేంద్రానికి సామాన్యులు చ‌దివించుకుంటున్నారు. ఇవి రేండెనా?  జీఎస్టీల్లో కేంద్రం వాటా చాలా స్ప‌ష్టంగా తీసుకుంటున్నారు! ఇన్ని వ‌సూళ్లు కాక‌.. ఏడేళ్ల‌లో ఎన‌భై ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అప్పు!

మ‌రి కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ఏమున్నాయి? ఒక్కోటీ ఎత్తి ప‌డేస్తూ ఉన్నారు. ఎరువుల‌పై రాయితీలు, స‌బ్సిడీల‌కు మంగ‌ళం పాడారు! దీంతో ఈ రోజు రైతులు ఏ ఎరువు కొనాలాన్నా.. గ‌తంతో పోలిస్తే రెట్టింపు ధ‌ర‌లు చెల్లించుకోవాల్సి వ‌స్తోంది. అదేమంటే రైతుల ఖాతాలోకి ఏడాదికి రెండు వేల రూపాయ‌ల‌తో ఉద్ధ‌రింపు అంటున్నారు. ఆ రెండు వేల రూపాయ‌ల‌తో రెండు బ‌స్తాల ఎరువు కూడా రాదు ప్ర‌స్తుతం ఉన్న రేట్ల‌లో!

ఇవ‌న్నీ చాల‌క‌.. పెట్టుబడుల ఉప‌సంహ‌ర‌ణ పేరుతో ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల అమ్మ‌కాలు! ఎల్ఐసీ తో మొద‌లుపెడితే లాభాల్లో ఉన్న‌వి, న‌ష్టాల్లో ఉన్న‌వి తేడా లేకుండా అమ్మ‌కాలు సాగుతున్నాయి. దేశ‌భ‌క్తి, జాతీయ‌వాదం ముసుగులో.. ఇలాంటి పాల‌న సాగుతూ ఉంది. అయితే పై ముసుగుల‌తో .. ఎవ‌రూ దేన్నీ గుర్తించే ప‌ని లేదు. 

మాటెత్తితే రాష్ట్ర ప్ర‌భుత్వాలంటే దోపిడీ చేస్తుంటాయ‌ని, కుటుంబ పార్టీల‌ని సుద్దులు చెబుతూ.. తామేం చేస్తున్నామ‌నే విష‌యాన్ని ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ధీమాతో ఉన్న‌ట్టున్నారు క‌మ‌ల‌నాథులు!