క్విడ్ ప్రో కో కేసుల్లోంచి తమను తప్పించాలని కోరుతూ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణలో ఆసక్తిదాయకమైన ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి.
జగన్ పై సీబీఐ నమోదు చేసిన ఈ కేసులకు సంబంధించి నిందితులు ఒక్కొక్కరుగా క్వాష్ పిటిషన్లను దాఖలు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్నింటిపై విచారణ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసుకున్న పిటిషన్ లో ఆసక్తిదాయకమైన వాదనలు వినిపిస్తున్నాయి.
వైఎస్ఆర్ ఫౌండేషన్ కు ఏడు కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా ఇవ్వగా.. దాన్ని కూడా లంచం అంటూ, క్విడ్ ప్రో కో అంటూ సీబీఐ అభియోగాలను నమోదు చేసిందని నిమ్మగడ్డ ప్రసాద్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు.
నిమ్మగడ్డ ఫౌండేషన్ ద్వారా వివిధ స్వచ్ఛంద సంస్థలకూ, ఆర్తులకూ 130 కోట్ల రూపాయల మేర విరాళాలు ఇచ్చారని.. అందులో ఏడు కోట్ల రూపాయల మొత్తాన్ని వైఎస్ఆర్ ఫౌండేషన్ కు ఇచ్చినట్టుగా లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే 130 కోట్ల రూపాయల్లో ఈ ఏడు కోట్ల రూపాయలు మాత్రం లంచం లాగా చూపి, కేసులను నమోదు చేశారన్నారు.
ఫౌండేషన్ కు ఇచ్చిన మొత్తాన్ని కూడా లంచం కింద చూపి.. క్విడ్ ప్రో కో అన్నారని.. సీబీఐ మోపిన అభియోగాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు. అలాగే సండూర్ పవర్, భారతీ సిమెంట్ లో నిమ్మగడ్డ పెట్టుబడుల విలువ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు అని సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న వైనాన్ని కూడా న్యాయవాది ప్రస్తావించారు.
నిమ్మగడ్డ పెట్టుబడులు.. వచ్చిన లాభాలను కూడా పెట్టుబడులు అంటూ ప్రస్తావించారని, లాభాలను కూడా లంచాల కింద చార్జిషీట్లో పేర్కొన్నట్టుగా నిమ్మగడ్డ తరఫు న్యాయవాది వాదించారు.
ఇలా సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లలోని అంశాలను ప్రస్తావిస్తూనే.. ఈ కేసుల నుంచి తమను తప్పించాలని.. వీటిల్లోని నిందితులు ఒక్కొక్కరుగా కోర్టును అర్తిస్తున్నారు. ఈ కేసుల్లో విచారణలు సాగుతూ ఉన్నాయి. తీర్పులు ఎప్పుడొస్తాయనేది ఆసక్తిదాయకమైన అంశం. క్వాష్ పిటిషన్లలో నిందితులు బయటకు వస్తే.. ఈ కేసుల్లో సీబీఐ నమోదు చేసిన చార్జిషీట్లు మరింత డొల్లగా మారే అవకాశం ఉంది.